ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు కీలక సవరణలు చేస్తూ, రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదాకు న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఆ గడువు గతేడాది జూన్ 2తో ముగిసింది. అయితే ఆ తర్వాత ఏపీకి అధికారిక రాజధాని ఏది అనే అంశంపై చట్టంలో స్పష్టత లేకపోవడం, గత ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనతో తలెత్తిన న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ నుంచే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న రాష్ట్ర కోరికపై కొన్ని సాంకేతిక అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే 2024 జూన్ నుంచి రాజధానిగా అమరావతిని ఖరారు చేసే అవకాశం ఉంది.
ఈ బిల్లు ఆమోదం పొందితే అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్, అడ్మినిస్ట్రేటివ్ ఐడెంటిటీ లభిస్తుంది. ఈ చట్టబద్ధత వల్ల అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంక్, ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి భారీ రుణాలు పొందడం సులభతరం అవుతుంది. ముఖ్యంగా పదేళ్లుగా పోరాటం చేస్తున్న 34 వేల మంది రైతులకు భరోసా దక్కుతుంది. రెండో విడత భూసమీకరణలో భూములు ఇస్తున్న రైతులకు ధైర్యం వస్తుంది.
