ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచేది మేధావి వర్గం. ఏ రాజకీయ పార్టీకి , అధికార పీఠానికి లొంగకుండా, నిష్పక్షపాతంగా సమాజ హితాన్ని కాపాడటం, పాలకుల తప్పులను ఎండగట్టడం విద్యావేత్తలు, మేధావుల ప్రాథమిక బాధ్యత. కానీ, దురదృష్టవశాత్తూ ప్రస్తుత తెలుగు రాజకీయ ముఖచిత్రంలో ఈ వ్యవస్థ పూర్తిగా కలుషితమైపోతోంది. ఒకప్పుడు నైతిక విలువలకు, నిబద్ధతకు నిలువెత్తు రూపాలుగా నిలిచిన కొందరు సోకాల్డ్ మేధావులు, విశ్లేషకులు.. నేడు తెరవెనుక ఉండే కొన్ని రాజకీయ శక్తుల చేతుల్లో ప్రాక్సీలు గా మారిపోవడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న క్యారెక్టర్‌ను, సమాజంలో ఉన్న గౌరవాన్ని స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అమ్ముకుంటున్న తీరు విజ్ఞులనదగిన వారిని సైతం విస్మయానికి గురిచేస్తోంది.
మేధావుల ముసుగులో ఇతర పార్టీలపై దాడి చేయడం పొలిటికల్ ప్రాక్సీ టెర్రరిజమే
రాజకీయాల్లో ఎవరైనా తమకు నచ్చిన సిద్ధాంతాన్ని విశ్వసించవచ్చు, తాము ఇష్టపడే పార్టీకి మద్దతుగా నిలబడవచ్చు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ పాలసీగా భావించవచ్చు. కానీ, ఒక పార్టీ ఇచ్చే లబ్ధి కోసమో లేదా రహస్య ప్యాకేజీల కోసమో ఊడిగం చేస్తూ.. సదరు పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఇతర రాజకీయ పక్షాలపై నిందలు వేయడం, విషప్రచారం చేయడం మేధావి లక్షణం అనిపించుకోదు. ముసుగులు ధరించి, స్వతంత్ర విశ్లేషకులమంటూ సమాజంపైకి వచ్చే ఈ తరం పేటీఎం మేధావుల వైఖరిని గమనిస్తే.. అంతర్జాతీయంగా విధ్వంసం సృష్టించే ప్రాక్సీ టెర్రరిస్టుల వ్యూహాలు గుర్తొస్తాయి. ఆ ఉగ్రవాద గ్రూపులు కూడా తమకు నిధులు ఇచ్చే హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే దాడులు చేస్తాయి కానీ, తాము ఎవరి కోసం చేస్తున్నామో బహిరంగంగా ఒప్పుకోవు. ఇక్కడి ముసుగు మేధావుల పరిస్థితి కూడా సరిగ్గా అంతే. తమ వెనుక ఉన్న పొలిటికల్ బాస్‌ల స్క్రిప్ట్ పట్టుకుని, ప్రత్యర్థి పార్టీలపై మేధోపరమైన దాడులకు తెగబడుతున్నారు.
డబ్బు కోసం క్యారెక్టర్‌ను తాకట్టు పెడతారా?
ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవనీయమైన వ్యక్తులుగా చలామణీ అయిన వారు సైతం.. కెరీర్ ముగింపు దశలో కేవలం డబ్బు కోసం, పదవుల కోసం కక్కుర్తి పడటం విషాదకరం. జీవితకాలం మొత్తం మాట్లాడిన సిద్ధాంతాలు, ఆదర్శాలను పక్కనబెట్టి.. చివరికి సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్, ప్రాక్సీ ఏజెంట్లు గా ముద్ర వేయించుకోవడం వారి వ్యక్తిగత పతనమే కాదు, మొత్తం మేధావి వర్గానికే ఒక మాయని మచ్చ. ఎప్పుడైతే ఒక మేధావి తన కలం లేదా గళాన్ని అమ్ముకుంటాడో, ఆ క్షణమే సమాజంపై అతనికున్న నైతిక హక్కును కోల్పోతాడు. ఇటువంటి ప్రాక్సీ దాడులను ఇప్పుడు సమాజం గానీ, క్షేత్రస్థాయిలోని రాజకీయ శ్రేణులు గానీ ఎంతమాత్రం భరించడానికి సిద్ధంగా లేవు.
రాజకీయ పార్టీలు భరించడానికి సిద్ధంగా లేవు!
రాజకీయ రంగంలో ఇలాంటి ముసుగు దాడులను, అజెండాలను సమర్థవంతంగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ఈ ప్రాక్సీ గ్రూపులు మరింతగా చెలరేగిపోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యాన్ని, విలువలతో కూడిన విశ్లేషణలను కాపాడుకోవాలంటే.. స్వతంత్ర హోదా వెనుక దాగి ఉన్న ఇలాంటి అసలు రంగులను ప్రజల ముందు నిలబెట్టక తప్పదు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం క్యారెక్టర్‌ను త్యాగం చేసి, సమాజ విశ్వసనీయతను దెబ్బతీస్తున్న ఈ సోకాల్డ్ పెద్దలు’ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముసుగులు వీడి నేరుగా రాజకీయ క్షేత్రంలోకి రావడం లేదా.. కనీసం తాము నమ్ముకున్న వృత్తికైనా న్యాయం చేస్తూ ప్రాక్సీలుగా మారకుండా ఉండటమే వారు సమాజానికి చేసే మేలు.
