తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానంటూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జోసెఫ్ విజయ్ , ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు ఆయన రాజకీయ పరిణతిపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాల ఎపిసోడ్, ఆయన ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా.. పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా కనిపిస్తోంది.
25 మంది మద్దతిస్తే ముగ్గురితోనే రాజీనామాలా?
తమిళగ వెట్రి కజగం సొంతంగా పూర్తి మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో విజయ్ అడుగులు వేస్తున్నారు. అలా రావాలంటే కనీసం పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. అన్నీ గెలవాలి. విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇచ్చారు. నిజానికి ఇది చాలా రిస్క్ . అయినా విజయ్ రాజకీయం చేశారు. ఇప్పుడు ఆ మద్దతిచ్చిన వారిని ఏం చేస్తారా అన్న ప్రశ్న వచ్చింది. వారిపై అనర్హతా వేటుకు కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన పళనిస్వామి చేస్తున్నారు. అలాంటి సమయంలో విజయ్ ముందు విలీనం అనే గొప్ప అవకాశం ఆయన ముందు ఉంది. మరో ఐదుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించి ఉంటే, అనర్హత వేటు పడకుండా ఏకంగా అన్నాడీఎంకే శాసనసభాపక్షాన్నే తన పార్టీలో కలిపేసుకునే వీలుండేది. కానీ, ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. అది సాధ్యం కాకపోతే అందరితో రాజీనామాలు చేయించాల్సింది. కానీ ముగ్గురిని మాత్రమే ఒప్పించగలిగారు. అంటే 25 మందిలో విజయకు మిగిలింది ముగ్గురేనా.
ఈపీఎస్ క్యాంప్‌లోకి ఐదుగురు
రాజీనామాల వ్యూహం అమలు చేయాలని చూసేసరికి, కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చారు. మిగిలిన వారిలో భయం మొదలైంది. ఉపఎన్నికలకు వెళ్లడం ఇష్టం లేక, తమ పదవులు ఎక్కడ ఊడిపోతాయో అన్న ఆందోళనతో ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి ఎడప్పాడి పళనిస్వామి గూటికి చేరిపోయారు. దీంతో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం బలం 25 నుంచి 17కి పడిపోయింది. ఈ పరిణామం విజయ్ సర్కారుకు ఒకరకమైన నైతిక ఓటమిగా పరిగణించవచ్చు. ఎమ్మెల్యేలను పూర్తిస్థాయిలో నమ్మించడంలో లేదా వారిలో భరోసా నింపడంలో విజయ్ టీమ్ విఫలమైందనేది స్పష్టమవుతోంది.
అందరిలాగే ఫిరాయింపు రాజకీయం
ద్రవిడ పార్టీల సంస్కృతికి భిన్నంగా సరికొత్త రాజకీయాలు చేస్తానని మాటిచ్చిన విజయ్, అధికారం చేపట్టిన రెండు నెలలకే పక్క పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి పాత పద్ధతులను ఆశ్రయించడం ప్రజల్లో ప్రతికూలతను పెంచుతోంది. అందరూ చేసే పనులే విజయ్ కూడా చేస్తున్నాడు అనే విరక్తి సామాన్య ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత , అభిమానులు ఆయన నుంచి ఆశించిన క్లీన్ పాలిటిక్స్ ఇక్కడ కనిపించడం లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ఆయన తన వ్యక్తిత్వానికి తానే స్వయంగా నష్టం చేసుకుంటున్నారు.
ఉపఎన్నికల గండం – తేడా కొడితే ముప్పే
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఆరు నెలల్లోగా ఉపఎన్నికలు రావడం ఖాయం. ఒకవేళ ఆ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఓడిపోతే, విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదని విపక్షాలు గట్టిగా ప్రచారం చేస్తాయి. ఇది ఒక రకంగా ప్రభుత్వంపై రిఫరెండం లాగా మారుతుంది. పూర్తి మెజారిటీ కోసం వేసిన ఈ ఎత్తుగడ చివరకు తనకే ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఉపఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా, విజయ్ రాజకీయ భవిష్యత్తు , ప్రభుత్వ మనుగడ సంకటంలో పడటం ఖాయం. విజయ్ చేస్తున్న ఈ ‘రాజీనామా వ్యూహం’ రాజకీయంగా రిస్క్ తో కూడుకున్నది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంటారా లేక మిగిలిన వారిని కూడా బయటకు తీసుకువస్తారా అన్నది వేచి చూడాలి.
