భాజ‌పా వ్య‌తిరేక ప‌క్షాల‌కు చంద్ర‌బాబు సార‌థ్య‌మా..?

భార‌తీయ జ‌న‌తా పార్టీ, తెలుగుదేశం పార్టీల మ‌ధ్య పొత్తు నిలుస్తుందా..? ఆంధ్రాకు బ‌డ్జెట్ లో మొండిచేయి చూపించ‌డంతో ఆగ్ర‌హంగా ఉన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భాజ‌పాతో పొత్తును తెంచుకుంటారా..? ఇలాంటి అంశాల‌పై జాతీయ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు రావ‌డం విశేషం. ఢిల్లీ వ‌ర్గాల్లో కూడా ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం! భాజ‌పాతో టీడీపీ తెగ‌తెంపులు చేసుకుంటార‌నే అభిప్రాయం హ‌స్తినలో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు, కొన్ని మీడియా సంస్థ‌లైతే మ‌రో అడుగు ముందుకేసి… చంద్ర‌బాబు నాయుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందంటూ ఊహాగానాలు ప్ర‌చారంలోకి తీసుకొస్తున్నాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీపై కొన్ని పార్టీలు తీవ్ర‌మైన ఆగ్ర‌హంతో ఉన్నాయ‌నీ, వాట‌న్నింటినీ ఏకం చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు క‌థ‌నాలు ఇవ్వ‌డం విశేషం! అంతేకాదు, దీనికి 1996 నాటి ప‌రిస్థితిని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతూ… మ‌ళ్లీ అదే వ‌చ్చే దిశ‌గా రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయంటూ విశ్లేషించారు. 1996లో కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ యేత‌ర పార్టీల‌ను ఒక తాటిపైకి తీసుకొచ్చి థ‌ర్డ్ ఫ్రెంట్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు కీల‌కపాత్ర పోషించారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంద‌నీ, భాజ‌పాయేత‌ర పార్టీల‌ను ఆయ‌న ఏకం చేస్తార‌నీ, ఇప్ప‌టికే కొన్ని పార్టీల‌కు సంబంధించిన నేత‌ల‌తో ఆయ‌న మాట్లాడుతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఢిల్లీలోని ఆంగ్ల‌, హిందీ మీడియాల్లో ఈ క‌థ‌నాలు ప్రముఖంగా క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబు భాజ‌పాను వీడి బ‌య‌ట‌కి వ‌చ్చేస్తున్న‌ట్టుగా అక్క‌డ ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, ఢిల్లీలో వినిపిస్తున్న మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే… ఎన్డీయే నుంచి శివ‌సేన బ‌య‌ట‌కి వెళ్తుందా, దానికంటే ముందే టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చేస్తుందా అనే చ‌ర్చ జ‌ర‌గ‌డం! శివ‌సేన, టీడీపీ లాంటి పార్టీలే ప్ర‌ధాన‌మంత్రి మోడీ తీరుతో విసిగిపోయి బ‌య‌ట‌కి వ‌చ్చేస్తుంటే… ఇక మిగ‌తా పార్టీలకి ఎన్డీయేలో గుర్తింపు ఎక్కడ ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకోప‌క్క‌, రాజస్థాన్ లో రెండు లోక్ స‌భ‌, ఒక అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా భాజ‌పాపై తీవ్ర‌స్థాయిలో ప్ర‌జా వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌డం, బెంగాల్ లో కూడా భాజ‌పాకి ఆద‌రణ ల‌భించ‌క‌పోవ‌డం, ఇంకోపక్క త్వ‌ర‌లో ఎన్నిక‌లు సిద్ధ‌మౌతున్న క‌ర్ణాట‌క‌లో కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంద‌ర్భంలోనే భారీ ఎత్తున బంద్ జ‌ర‌గ‌బోతుండ‌టం… వెర‌సి భాజ‌పా వ్యతిరేక పవనాలుగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో భాజపాకి దూర‌మ‌య్యేందుకు కొన్ని పార్టీలు సిద్ధ‌మౌతున్నాయ‌నీ, అవ‌న్నీ ఒక గొడుగు కింద‌కి వ‌చ్చే ఆస్కారం ఉంద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

చంద్ర‌బాబు నిజంగానే పొత్తు తెంచుకునే ప‌రిస్థితి ఉందా అనేది వేరే చర్చ‌. భాజ‌పాపై ఆగ్ర‌హంగా ఉన్న పార్టీల‌కు ఆయ‌న సార‌థ్యం వ‌హించ‌డం నిజ‌మేనా అనేది మ‌రో చ‌ర్చ‌! ఈ రెండూ ప‌క్క‌నపెడితే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భాజ‌పా స‌ర్కారు అన్యాయం చేసిందీ అనే అంశానికి జాతీయ స్థాయిలో కొంత ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌న్న‌ది వాస్త‌వం. మ‌రి, ఈ నేప‌థ్యంలో భాజ‌పా వైఖ‌రిలో ఏదైనా మార్పు వ‌స్తుందేమో అనేది కూడా అత్యాశే… కానీ, ఓ చిన్న ఆశ‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.