కమ్యూనిస్టులపై కన్నెర్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తెలుగుదేశం పార్టీ సమావేశాలలోనూ అధికారులతో సమీక్షలలోనూ కమ్యూనిస్టులపై విరుచుకుపడటం పాత రోజులను తలపిస్తుందంటున్నారు. ఇదివరలో అధికారంలో వున్నప్పుడు కమ్యూనిజం లేదు సోషలిజం లేదు ఉన్నదంతా టూరిజమేనన్న ఆయన మాటలు బాగా పేరొందాయి. తర్వాత విద్యుచ్చక్తి ఉద్యమంతో ఈ ఘర్షణ తారస్థాయికి చేరింది. చివరకు ఆయన ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి కమ్యూనిస్టులతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవడం కోసం ఆయన ఎంతగా తాపత్రయపడ్డారో చూసిన వారికి తెలుసు. 2014లో మోడీ మోత నేపథ్యంలో మళ్లీ బిజెపితో చేతులు కలిపారు. అదంతా గతం. ఈ సారి అధికారంలోకి వచ్చాక ఎంతసేపటికీ వైఎస్‌ఆర్‌సిపిని జగన్‌ను మాత్రమే ఎప్పుడూ ప్రస్తావిస్తూ మిగిలిన పార్టీలను అంటే కమ్యూనిస్టు కాంగ్రెస్‌ పార్టీలను పూర్తిగా విస్మరించారు. మామూలు మాటల్లో టిడిపి నేతలు కమ్యూనిస్టులతో ఇబ్బంది లేదు వైసీపీతోనే మా తలనొప్పి అంటుంటారు గాని వాస్తవంలో ప్రజాసమస్యలపైన ముఖ్యంగా భూసేకరణ వంటి అంశాలపైన కమ్యూనిస్టులు చేసే పోరాటాలు వారు అస్సలు భరించలేకపోతున్నారు. అధికారిక సమావేశాలలో ఇలాటి ఉద్యమాలు జరిగే జిల్లాలు కేంద్రాలు ఒక్కొక్కటి తీసుకుని ఏ మేరకు ఉద్యమాలను అణచేయగలిగామని చెప్పుకుని ఆనందించడం పరిపాటిగా మారింది. కలెక్టర్ల సమావేశంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. తాజాగా జరిగిన మీడియా గోష్టిలో ఆయన వంశధార ప్రాజెక్టుకు సంబంధించి హీరమండలంలోని ప్రజలను కొందరు రెచ్చగొడుతున్నారని కమ్యూనిస్టులపై వ్యాఖ్యలు చేశారు. 5 కోట్ల రూపాయల ఆస్తులు తగలబెట్టారని ఆరోపించారు. అయితే నష్టపరిహారం ఇంకా కొందరికి అందలేదని మాత్రం అంగీకరించవలసి వచ్చింది. సరిగ్గా పరిహారం పునరావాసం సమస్యలపైనే ప్రాజెక్టుల ప్రాంతాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ మద్యనే సిపిఎం కార్యదర్శి మధు ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం ఇచ్చినప్పుడు పోలవరం ముంపు ప్రాంతంలో నష్టపరిహారం ఇస్తే నిర్మాణానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. వంశధార ప్రాంతంలో ఇప్పుడు పర్యటిస్తున్న మధు పోలీసులు టిడిపిప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. అక్కడ కమ్యూనిస్టు నాయకులందరినీ ముందస్తుగా అరెస్టు చేసి రిమాండుకు పంపిన నేపథ్యంలోనే మధు ఈ మాటలన్నారు. ఏది ఏమైనా మరోసారిఉద్యమాలపైన పోలీసులను ఉసిగొల్పడం, అరెస్టులు చేయించడం వంటివి ప్రజలలో వ్యతిరేకత తెస్తాయనే ఆందోళన టిడిపి వర్గాలలోనే వుంది. కాని ముఖ్యమంత్రి మాత్రం తను అనుకున్న ప్రకారమే ముందుకుపోవాలని నిర్ణయించుకున్నారట. ఎలాటి చర్చలకూ సర్దుబాట్టకూ ఆయన సిద్ధంగా కనిపించడం లేదు. ఒక సమస్యపై మెత్తబడితే అన్నిటిలో అదే అడుగుతారని ఆయన అంటున్నారట. ఎక్కడైనా పట్టువిడుపులు లేని ప్రభుత్వ నిర్వహణ సాధ్యమా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.