బాహుబ‌లి ‘బ‌లం’ వ‌సూళ్ల‌లోనేనా..??

భార‌తీయ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది బాహుబ‌లి. ఈ రికార్డుల‌కు బాలీవుడ్డే త‌ల‌దించింది. సాహోరే… బాహుబ‌లి అంటూ స‌లాం చేసింది. బాలీవుడ్‌లో ఈ రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌డానికి ఖాన్ త్ర‌యానికే చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. తెలుగు నాట అయితే బాహుబ‌లి రికార్డుల్ని అందుకోవ‌డం దాదాపుగా అసాధ్య‌మే! జాతీయ స్థాయిలో బాహుబ‌లి ది బిగినింగ్‌కి చెప్పుకోద‌గిన అవార్డులే వ‌చ్చాయి. ఉత్తమ చిత్రంగానూ నిలిచింది. బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ కూడా హ‌వా చూపించే అవ‌కాశం ఉంది. అయితే.. బాహుబ‌లి బ‌లం.. ఇంత వ‌ర‌కేనా అనిపిస్తోందిప్పుడు. ఆస్కార్ త‌ర‌పున మ‌న దేశం నుంచి పంపే ఎంట్రీల్లో బాహుబ‌లికి అవ‌కాశం రాలేదు. ఆ స్థానంలో చ‌డీ చ‌ప్పుడు లేని న్యూట‌న్ అనే ఓ చిన్న సినిమా… క‌నిపించింది. న్యూట‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ 120 కోట్ల భార‌తీయుల‌లో ఎంత మందికి తెలుసు..? అస‌లు ఆ సినిమా పేరు ఎప్పుడైనా విన్నారా?? బాహుబ‌బ‌లి గురించైతే… ఇప్ప‌టికీ మాట్లాడుకొంటూనే ఉన్నారు. రికార్డులు చూసి జ‌బ్బ‌లు చ‌రుచుకొంటున్నారు. ఇప్పుడు బిగ్గెస్ట్ ఇండియాన్ ఫిల్మ్‌… బాహుబ‌లినా?? న‌్యూట‌నా??? అని అడిగితే… ఎవ‌రైనా స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా??

సాంకేతిక‌త విష‌యంలో… బాహుబ‌లి ఓ మైలురాయి సాధించింది. ఈ విష‌యంలో తిరుగులేదు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌కుండా ఈ సినిమాని తీర్చిదిద్దాడు రాజ‌మౌళి. కానీ.. క‌థ ప‌రంగా చూస్తే.. బాహుబ‌లి ద‌మ్ము స‌రిపోదు. ఈ స‌మాజానికి బాహుబ‌లి చెప్పేదేం లేదు. దాన్ని చూసి నేర్చుకోవాల్సిన విష‌యాలూ లేవు. ఆస్కార్ పుర‌స్కారాల బ‌రిలో నిల‌వాలంటే క‌థ‌, క‌థ‌నాలు, అందులోని సాంకేతిక‌త కంటే… భావోద్వేగాల‌కే పెద్ద పీట‌. ఆ విష‌యంలో ఆస్కార్ ప్ర‌మాణాల‌కు బాహుబ‌లి దూరంగా ఉన్న‌ట్టే లెక్క‌. బాహుబ‌లి ది కన్‌క్లూజ‌న్ ఒక్క‌టేకాదు, బాహుబ‌లి ది బిగినింగ్ కూడా.. ఒడ‌పోత‌లో నెగ్గ‌లేక‌పోయింది. బాహుబ‌లి లాంటి సాంకేతిక హంగులు హాలీవుడ్ ఎన్నో చూసింది. వాళ్ల‌కు కావ‌ల్సింది.. గ్రాఫిక్స్ మాయాజాలం కాదు. అందుకే బాహుబ‌లి ఆస్కార్ ఎంట్రీ ముందు త‌ల‌వొంచింది. ఇందుమూలంగా మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. బాహుబ‌లి సిరీస్ తెలుగుజాతికీ ఇండియ‌న్ సినిమాల‌కు గ‌ర్వ‌కార‌ణం.. అంత‌ర్జాతీయ ప్రమాణాల‌కు కాదు!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.