చంద్ర‌బాబు కూడా ద‌క్షిణాది వాద‌న వినిపిస్తారా..?

నిజానికి, ఉత్త‌రాది ఆధిప‌త్యం.. ద‌క్షిణాదిపై నిర్ల‌క్ష్యం అనేమాట జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ ఎక్కువ‌గా మాట్లాడేవారు. ఆయ‌న నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ల్లో చాలా ప్ర‌ముఖంగా ఈ టాపిక్ ఉండేది. ఢిల్లీ పెత్త‌నం పెరిగిపోతోంద‌నీ, ద‌క్షిణాదిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయ‌నే స్పృహ లేకుండా పోతోంద‌నీ, ఇలా అయితే వేర్పాటువాదం పెచ్చ‌రిల్లుతుంద‌నీ అనేవారు. దాదాపు అలాంటి వాద‌న‌కే ఇప్పుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా తెర తీశారనే అభిప్రాయం కలుగుతోంది. కొత్త చర్చకు తెర తీయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడారేమో అని చెప్పలేం. మ‌రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాదిరిగా ‘వేర్పాటు’ అనే స్థాయిలో కూడా మాట్లాడ‌లేదుగానీ.. స్థూలంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర నిర్ల‌క్ష్యం అనే అంశం స్ఫురించేలా మాట్లాడారు.

శాస‌నమండ‌లిలో సీఎం మాట్లాడుతూ… రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన తీరు చాలా బాధాక‌ర‌మైన అంశం అన్నారు. జాతీయ పార్టీలు జాతి ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌న్నారు. కాంగ్రెస్ మాదిరిగానే భాజ‌పా కూడా రాష్ట్రాన్ని చిన్న‌చూపు చూస్తోంద‌ని విమ‌ర్శించారు. కేంద్రానికి వ‌చ్చే ఆదాయంలో ద‌క్షిణాది రాష్ట్రాలు చెల్లించే ప‌న్నుల శాత‌మే ఎక్కువ‌గా ఉంటుంద‌నీ, కానీ.. ద‌క్షిణాది రాష్ట్రాల ప‌న్నుల‌తో ఉత్త‌రాదిని అభివృద్ధి చేస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కేంద్రం మాత్రం అభివృద్ధి విష‌యంలో ఉత్త‌ర‌ భార‌తానికే ప్రాధాన్య‌త ఇస్తోంద‌నీ, మీరు మాత్ర‌మే అభివృద్ధి చెందుతున్నార‌న్నారు. చ‌ట్ట‌ప్ర‌కారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన‌వి కేంద్రం ఇవ్వ‌డం లేద‌నీ, కానీ భాజ‌పా నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. సిమెంట్లు రోడ్ల‌కు మా డ‌బ్బులు ఇచ్చామ‌ని అంటున్నార‌నీ, మా డ‌బ్బూ మీ డ‌బ్బూ అంటూ ఏమీ ఉండ‌ద‌నీ, ప్ర‌జ‌లు ప‌న్నుల రూపంలో చెల్లిస్తే.. రాష్ట్రానికి హ‌క్కుగా ఇవ్వాల్సిన వాటాలు ఇస్తార‌ని గుర్తించాలన్నారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగంలో ద‌క్షిణాది నిర్ల‌క్ష్యం అనే భావ‌న క‌నిపించ‌డం ప్ర‌త్యేకంగా ఉంది. ఉత్త‌రాదికే కేంద్రం ఎక్కువ నిధులు ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించ‌ండమూ కాస్త కొత్త‌గానే వినిపిస్తోంది. ఎందుకంటే, విభ‌జ‌న హామీలు – కేంద్రం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రి.. ఈ ప‌రిధిలో మాత్ర‌మే చంద్ర‌బాబు విమ‌ర్శ‌లూ వ్యాఖ్యానాలూ ఉంటూ వ‌స్తున్నాయి. కానీ, వాటి మ‌ధ్య‌లో ఈ కాన్సెప్ట్ తీసుకుని రావ‌డం కొంత చ‌ర్చ‌నీయం అవుతుంద‌నే చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.