నేడు స్టాలిన్ వద్దకు బాబు..! కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?

Chandrababu Naidu to meet DMK president Stalin
Chandrababu Naidu to meet DMK president Stalin

దేశంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఒడిఒడిగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం బెంగుళూరు వెళ్లి జెడీయస్ అధినేత , మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక ముఖ్యమంత్రి కుమార్ స్వామిలతో భేటీ అయ్యారు. చంద్రబాబును దేవెగౌడ, కుమారస్వామిలు పద్మనాభనగర్ లోని తమ నివాసం బయటకు వచ్చి మరీ సాదరంగా ఆహ్వానించారు. తరవాత పలు అంశాలపై.. మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న అన్యాయం, 1996నాటి పరిస్థితులు, అప్పుడు ప్రధానిగా దేవెగౌడ బాధ్యతల స్వీకారం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. దేశంలో లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు , కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడలు ఏకాంతంగా నలభై ఐదు నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఈ బేటీలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలపై ప్రధానంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ లో మూకుమ్మడి ఐటీ దాడులు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలను అమలు చేయకపోవడం, సీబీఐ, ఆర్.బి.ఐ లో ప్రభుత్వం జోక్యం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మాయావతి, ములాయాంసింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, అజిత్ సింగ్ వంటి నేతలు కలిసి వచ్చేందుకు అంగీకరించారని తాను డీఎంకె అధినేత స్టాలిన్, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలతో కూడా మాట్లాడతానని చంద్రబాబు దేవెగౌడకు చెప్పారు. ఎక్కడైనా అవసరమైతే తాను కూడా మాట్లాడతానని చంద్రబాబుకు దేవెగౌడ హామీ ఇచ్చారు. జనవరిలో రైతాంగ సమస్యలపై బెంగుళూరులో నిర్వహించనున్న ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. అదే నెలలో పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ర్యాలీకి కూడా అందరం హాజరవనున్నారు. కూటమికి త్వరలో తుది రూపు తీసుకువస్తామని, ఇవి ప్రాధమిక చర్చలు మాత్రమేనని చంద్రబాబు చెబుతూ లౌకిక వాద శక్తులన్నింటినీ ఏకం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు, దేవెగౌడ ఇరువురు రాజకీయ లెక్కలు తెలిసినవారని, 1996నాటి పరిస్థితులు 2019లో పునరావృతం కాబోతున్నాయని కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి, జెడీయస్ అధినేత దేవెగౌడ ముందుకు రావడంతో చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకు ఫలించినట్లయ్యింది. శుక్రవారం చెన్నైలో డీఎంకె అధినేత స్టాలిన్ తో చంద్రబాబు భేటీ అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com