నవంబర్‌లో జరగనున్న పెట్టుడుల సదస్సును విజయవంతం చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని ఏపీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. వీలైనన్ని దేశాల్లో ఆసక్తి చూపే పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఉండగా.. చంద్రబాబు మంగళవారం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ పారిశ్రామికవేత్తల్ని కలిసి ఏపీలో ఉన్న వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను వివరించనున్నారు. దుబాయ్, అబుదాబి, యూఏఈలో చంద్రబాబు పర్యటన సాగనుంది.
ఇటీవల గల్ఫ్ పెట్టుబడిదారులు ఏపీపై ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట గల్ఫ్ డయాస్ఫోరా నుంచి.. కొంత మంది ప్రముఖులు వచ్చి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపారు. ఇన్వెస్టోపియా పేరుతో జూలైలో జరిగిన సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ వచ్చారు. ఇందులో గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సీఐఐ ఈ సమావేశాన్ని సమన్వయం చేసింది.
దావోస్‌లో జనవరి 2025లో చంద్రబాబు నాయుడుతో 5 నిమిషాల సమావేశం తర్వాత, ఆయన విజన్‌కు ఆకర్షితులై, 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ ప్రకటించారు. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలను పరిశీలిస్తోంది. వారిని పెట్టుబడుల సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. నవంబర్ మొదటి వారంలో లండన్‌లో చంద్రబాబు పర్యటించనున్నారు.