అమ్మాయిల డ్రస్సింగ్ స్టైల్ పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. `దండోరా` ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన హద్దు దాటి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే శివాజీ స్పీచ్ ముగిసిందో.. అప్పటి నుంచే ఆయనపై కౌంటర్ ఎటాక్ మొదలైపోయింది. ముఖ్యంగా శివాజీ భాషపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పబ్లిక్ ఈవెంట్ లో శివాజీ ఈ స్థాయిలో మాట్లాడడం భావ్యం కాదన్నది అందరి మాట. శివాజీని నటుడిగా ఇష్టపడేవాళ్లు కూడా ఈ కామెంట్స్ ని తప్పుపడుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో కూడా శివాజీపై సెగ మొదలైంది. గాయని చిన్మయి శివాజీపై నేరుగా కౌంటర్ ఎటాక్ చేశారు. శివాజీ వాడిన పదాలు ప్రొఫెషనల్ గా ఏమాత్రం లేవని దుయ్యబట్టారు. ఆయన మహిళలకు అనవసరమైన సలహాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. శివాజీకి నిజంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం ఉంటే ధోతీలు మాత్రమే ధరించాలని, భారతీయ సంస్కృతిని అనుసరించి బొట్టు పెట్టుకోవాలని, వివాహం చేసుకున్నట్లయితే అది తెలియడానికి కంకణం, మెట్టెలు ధరించాలని కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు అనసూయ కూడా తన నిరసన వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో ‘ఇట్స్ మై బాడీ.. నాట్ యువర్స్’ అనే ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘ఇది నా శరీరం నీది కాదు’ అంటూ పరోక్షంగా శివాజీకి చురకలు అంటించారు. ఇంకెంతమంది… శివాజీ కామెంట్స్ పై తమ అసహనాన్ని వెళ్లగక్కుతారో చూడాలి.
శివాజీ కామెంట్లు ఏమాత్రం సమర్థనీయం కావు. ఈ విషయం ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. శివాజీ వీలైనంత త్వరగా మీడియా ముందుకొచ్చి, క్షమాపణలు చెబితే మంచిది. లేదంటే.. ఈ నిరసన మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం వుంది. ఆయన నటించిన ‘దండోరా’ సినిమాకీ, ఆయన నుంచి వస్తున్న మిగిలిన సినిమాలకూ ఇలాంటి నెగిటీవ్ పబ్లిసిటీ ఏమాత్రం మంచిదికాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలి.
