ఈయేడాది చివరి శుక్రవారం తలుపులు తెరచుకొన్నాయి. 2025కి గట్టిగా శుభం కార్డు వేయాలని టాలీవుడ్ కూడా భావిస్తోంది. అందుకే ఈ వారం గంపెడు సినిమాల్ని ముందుకు తీసుకొస్తోంది. అన్నీ రకరకాల జోనర్లే. క్రిస్మస్ సెలవలు రావడం, ఇయర్ ఎండ్ మూడ్, పెద్ద సినిమాల తాకిడి లేకపోవడం.. ఇవన్నీ తమకు కలిసొస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా, వృషభ…. ఇవన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విషయం ఏమిటంటే ఒకొక్కటీ ఒక్కో జోనర్. అన్నింటిపై మంచి అంచనాలే ఉన్నాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ చేసిన యాక్షన్ చిత్రం… ఛాంపియన్. తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథని రూపొందించారు. అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్, ప్రియాంకా దత్ నిర్మాతలు. వాళ్లకు మంచి ట్రాక్ రికార్డ్ వుంది. తండ్రి బాటలోనే కథని నమ్మి సినిమాలు తీస్తున్నారు. ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం… రోషన్ లుక్ బాగుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. శంబాలపై ఆది సాయి కుమార్ గట్టి నమ్మకాలు పెట్టుకొన్నాడు. మిస్టీరియస్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రమోషన్స్ పీక్స్ లో నడుస్తున్నాయి. ఆదికి ఇది రీ ఎంట్రీ అవుతుందన్నది దర్శక నిర్మాతల నమ్మకం.
ఈషా ఓ హారర్ సినిమా. బన్నీవాస్, వంశీ నందపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. వీళ్ల ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది. ఇటీవల వరుస విజయాలు అందుకొంటున్నారు. ఈటీవీ విన్ అనే బ్రాండ్ వాల్యూ కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకూ రెండు ట్రైలర్లు విడుదల చేశారు. రెండూ భయపెట్టాయి. థియేటర్లో కూడా ఇదే భయం కొనసాగితే హిట్టు గ్యారెంటీ. శివాజీ ప్రధాన పాత్ర పోషించిన `దండోరా` ఈవారమే వస్తోంది. ట్రైలర్ లో దమ్ము కనిపిస్తోంది. వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ వస్తోంది. మోహన్ లాల్ సినిమాలుకు తెలుగులో మంచి గిరాకీ ఉంటుంది. చారిత్రక నేపథ్యం, పునః జన్మలు.. వీటి చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది.
అన్నీ చిన్న, మీడియం సినిమాలే కాబట్టి… థియేటర్ల సమస్య ఉండకపోవొచ్చు. హిట్టూ, ఫ్లాపూ అనే మాట పక్కన పెడితే ఏడాది చివర్లోనూ బాక్సాఫీసు దగ్గర బోలెడంత సందడి కనిపించే ఛాన్సుంది. ఒకట్రెండు హిట్లు పడితే… 2025ని ఘనంగా ముగించినట్టే.
