ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వయస్సు దృష్ట్యా పోలీస్ స్టేషన్‌కు పిలవకుండా, బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలోనే విచారించేందుకు పోలీసులు ప్రాథమికంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు అందడంతో, సిట్ అధికారులు కేసీఆర్ ఇంటికి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ విచారణకు కేసీఆర్ స్వయంగా సహకరిస్తారా లేక న్యాయ నిపుణుల సలహాతో మరో నిర్ణయం తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు.
సిట్ నోటీసులు వస్తాయని బీఆర్ఎస్ అగ్రనేతలకు ముందే స్పష్టత ఉండటంతో, దీనిని ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ సింగరేణి బొగ్గు కుంభకోణం వంటి ఇతర వివాదాలు చర్చకు రాకుండా, ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే, ఈ చర్చను ప్రజల్లో సానుభూతిగా మార్చుకునేందుకు ప్లాన్ బిని అమలు చేసే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. విచారణను ఎదుర్కోవడం ద్వారా తాము క్లీన్‌గా ఉన్నామని నిరూపించుకోవాలా, లేక ప్రభుత్వ తీరును ఎండగట్టాలా అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో, సిట్ విచారణకు మరికొంత సమయం కావాలని కేసీఆర్ కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విచారణకు హాజరైతే చర్చ అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే తిరుగుతుందని, అది ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందిగా మారుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే, అనారోగ్యం లేదా ఇతర కారణాలతో విచారణను వాయిదా వేయించి, చర్చను మరోవైపుకు మళ్లించే వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలని సిట్ కేసీఆర్‌కు చెప్పినందున ఆయన.. సమాధానం ఇచ్చినప్పుడు క్లారిటీ రానుంది.
