సంక్రాంతి అంటే కోడి పందేలే అన్నట్లు మారిపోయింది. కోస్తా జిల్లాల్లో కోడిపందేలు కేవలం ఒక వినోదంగానే కాకుండా, కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయాయి. ఈసారి అవి ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. కేవలం జూదంగా కాకుండా.. అదొక పరువు, ప్రతిష్ఠకలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారు.
కో అంటే కోటి
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రదేశం, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాలు రక్తం మరిగే కోడిపందేల బరిలోకి దిగుతాయి. కో అంటే కోటి అన్న చందంగా పందెం బరుల వద్ద నగదు కట్టలు వరదలా పారుతున్నాయి. పండుగ మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల చేతులు మారుతాయని అంచనా. పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా, ప్రజాప్రతినిధుల అండదండలతో విలాసవంతమైన టెంట్లు, ఫ్లడ్ లైట్లు, భారీ స్క్రీన్ల మధ్య ఈ పందేలు అట్టహాసంగా సాగుతున్నాయి.
ఎప్పటికప్పుడు కొత్త ఏర్పాట్లు
ఈ ఏడాది పందేల సరళి చూస్తే పాత పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ బరిలో నిలుస్తుండగా, హైటెక్ హంగులు తోడయ్యాయి. పందెం కోళ్ల పెంపకం కోసం ప్రత్యేకమైన ఆహారం, శిక్షణ ఇస్తూ ఒక్కో పుంజును లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. కేవలం పందెం గెలవడమే కాకుండా, పరువు ప్రతిష్ఠల కోసమే పెద్ద మొత్తంలో డబ్బును బెట్టింగ్లుగా పెడుతున్నారు. ఇది పండుగ సరదా కంటే కూడా ఒక భారీ జూద ప్రక్రియగా రూపుదిద్దుకుంది. పందెం బరుల వద్ద ఏర్పాటు చేసే గుండ్ర ఆటలు, పేకాట శిబిరాలు, మద్యం విక్రయాలు, హోటళ్ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఎక్కువగా వచ్చేది ఇతర ప్రాంతాల వాళ్లే !
ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు కోడిపందేల కోసం తరలి వస్తున్నారు. గెలిచిన వారు కోట్లలో సంపాదిస్తుంటే, ఓడిన వారు తమ ఆస్తులను, పొలాలను అమ్ముకుని రోడ్డున పడుతున్న ఘటనలు అనేకం. చట్టం ప్రకారం నిషేధం ఉన్నప్పటికీ, సంప్రదాయం పేరిట సాగుతున్న ఈ హింసాత్మక క్రీడ సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలను పెంచుతోంది. ఇలాంటివి పండగ మూడు రోజులు ఏ ప్రభుత్వం ఉన్నా ఆపడం సాధ్యం కాదు. కానీ తర్వాత అయినా వీటిని కఠినంగా నియంత్రించాల్సి ఉంది.
