విశాఖలో గ్లోబల్ ఐటీ జెయింట్ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ముహుర్తం ఖరారు అయింది. కాపులుప్పాడ లో 22.19 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలు నిర్మాణానికి ఈ నెల 12న భూమి పూజ జరగనుంది. వేర్వేరు సర్వే నంబర్లలో 22.19 గుర్తించి కాగ్నిజెంట్ కు ఏపీఐఐసీ అప్పగించింది. ఇప్పటికే చదును పనులను పూర్తి చేశారు. ఓవైపు శాశ్వత క్యాంపస్ నిర్మాణం మరో వైపు తాత్కాలికంగా వేరే భవనంలో కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి.
రుషికొండ ఐటీ సెజ్ లోని మహతి బిల్డింగ్ లో తాత్కాలిక క్యాంపస్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. శాశ్వత భవనాలను రూ. 1600 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించి 10, 000 వేల మందికి 2029 నాటికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. 2029 నాటికి విశాఖలో కాగ్నిజెంట్ పూర్తిస్థాయి ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు నిర్వవహిస్తున్నారు. త్వరలో టీసీఎస్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఆఫీస్ రెడీ అయింది. శాశ్వతభవనాల నిర్మాణం కూడా ప్రారంభించనున్నారు.
దిగ్గజ ఐటీ కంపెనీలు ఆపరేషన్స్ చేపడుతుండటంతో విశాఖలో ఐటీ జోష్ వస్తోంది. గూగుల్ కు భూమి అప్పగించిన వెంటనే అక్కడ ఏఐ హబ్ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ తో పాటు పలు ఐటీ కంపెనీలు కూడా.. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. వచ్చే ఏడాది విశాఖ పూర్తిగా ఐటీ నగరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.