తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదంతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒక పెద్ద సవాల్‌గా మారింది. ఆర్టీసీ సమ్మె నోటీసు ఇచ్చినప్పటి నుండి ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, తీరా ప్రారంభమయ్యాక దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటూ నిందలు వేయడానికే ప్రాధాన్యత ఇస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ప్రతి చిన్న సమస్యకు ప్రతిపక్షాలే కారణమని ఆరోపించడం.. ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో బెదిరింపులకు తలొగ్గని కేసీఆర్
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే ఒకే ఒక్క మాటతో కార్మిక లోకాన్ని వణికించి, సమ్మెను నీరుగార్చగలిగారు. ఆ భయం కార్మికుల్లో ఇప్పటికీ ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ, అది చేతకానితనంగా మారకూడది.. కానీ ప్రస్తుత పరిస్థితి అలాగే మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం పవర్‌ను సమర్థవంతంగా వాడుకుని కార్మిక నేతలను దారిలోకి తెచ్చుకోవాలే తప్ప, ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డారని వాపోవడం వల్ల ఉపయోగం ఉండదు.
కార్మిక నేతలను దారికి తెచ్చుకోవడంలో వైఫల్యం
సమ్మెను అదుపు చేయడంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కార్మిక నేతలు సమ్మెకు సిద్ధమవుతున్నప్పుడే వారిని చర్చలకు పిలిచి, ఆల్టర్నేటివ్స్ చూపించడంలో రవాణా శాఖ వైఫల్యం చెందింది. విపక్షాలు రెచ్చగొడితే రెచ్చిపోయేంత బలహీనంగా కార్మిక సంఘాలు ఉన్నాయంటే.. ప్రభుత్వం వారిపై పట్టు కోల్పోయిందని అర్థం. మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్లో కార్మిక సంఘాలతో బలమైన నెట్వర్క్ ఏర్పరచుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.
విపక్షాల కుట్రలని చెప్పడం చేతకానితనమేనా?
ప్రభుత్వానికి అన్ని వ్యవస్థలు, అధికారం ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోందంటే, అది ప్రభుత్వ అసమర్థత కిందకే వస్తుంది. విపక్షాల కుట్రలను ముందే పసిగట్టి అడ్డుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ వంటి వారు పాత ఆరోపణలు పక్కన పెట్టి, కార్మికుల న్యాయబద్ధమైన కోర్కెలను పరిశీలించి, మొండిగా వ్యవహరిస్తున్న నేతలను దారిలోకి తెచ్చుకునే మార్గం చూడాలి. లేదంటే, రానున్న రోజుల్లో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్రరూపం దాల్చి ప్రభుత్వ ఇమేజ్ను మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. బలమైన ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు వెతుకుతాయి తప్ప, విపక్షాల మాయలో పడ్డారని సాకులు వెతకవు.
