పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయం.. కానీ గత బుధవారం నుంచి అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇచ్చేందుకు రాలేదు. మోదీపై దాడికి మహిళా ఎంపీలతో కుట్ర చేసినట్లుగా పక్కా సమాచారం ఉందని అందుకే తానే వద్దని చెప్పానని స్పీకర్ ప్రకటించారు. ఈ కారణంపై విపక్షాలు ట్రోల్స్ చేస్తున్నప్పటికీ, తెర వెనుక అసలు కారణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రధాని మోదీ సీటు వద్ద మహిళా ఎంపీల దృశ్యాల రిలీజ్
గత బుధవారం ప్రధాని మోదీ సభలోకి రాకముందే కాంగ్రెస్ మహిళా ఎంపీలు వ్యూహాత్మకంగా స్పీకర్ , ప్రధాని కూర్చునే స్థానాల వైపు దూసుకెళ్లడం, ఒకరికొకరు సైగలు చేసుకుంటూ చుట్టుముట్టడం వంటి దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
సాధారణ నిరసనలకు, ఉద్దేశపూర్వక కవ్వింపు చర్యలకు చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ మహిళా ఎంపీలు అత్యంత ప్రమాదకరంగా ప్రధాని కుర్చీ వైపు వెళ్లడం వెనుక ఒక పెద్ద కుట్రే ఉన్నట్లు స్పీకర్ అనుమానించారు. సభలో ప్రధానికి రక్షణ కల్పించలేమన్న ఉద్దేశంతోనే స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న తీవ్రత ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.
మహిళా ఎంపీలను ముందు పెట్టి పొలిటికల్ డ్రామాకు ప్లాన్
మహిళా ఎంపీలను ముందు పెట్టడం ద్వారా, వారిని అడ్డుకునే క్రమంలో బీజేపీ ఎంపీలతో ఘర్షణ పడేలా చేయడం, తద్వారా మహిళా ఎంపీలపై బీజేపీ దాడి అనే ముద్ర వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేది వీరి అసలు ప్లాన్ అని అర్థమవుతోంది. ఇది కేవలం ఆకస్మికంగా జరిగిన ఘటన కాదని, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ రాసిన పక్కా స్క్రిప్ట్ అని స్పష్టమవుతోందని బీజేపీ నేతలంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరగాల్సిన చోట, అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిని భౌతికంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం అత్యంత దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియో
కేవలం నిరసన వ్యక్తం చేద్దామనుకుని ప్లాన్ చేశామని.. ప్రధానిపై దాడికి ఎలాంటి ప్రణాళిక అమలు చేయలేదని అదంతా తప్పుడు క్లెయిమ్ అని ప్రయాంకా గాంధీ అంటున్నారు. కానీ పార్లమెంట్ లో బుధవారం జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మహిళా ఎంపీలతో నేరుగా ప్రధానిని అవమానించే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా తప్పుడు వ్యూహమని అంటున్నారు. ఈ అంశంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది.
