ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా మతపరమైన అంశాలు మునుపెన్నడూ లేనంతగా చర్చకు వస్తున్నాయి. ప్రతిపక్ష కుట్రల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్లు పావులా మారుతున్నారు. రాజకీయ వ్యూహకర్తలు తమ ఓటు బ్యాంకును పదిలపరుచుకోవడానికి, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి మతపరమైన సున్నిత అంశాలను వాడుకోవడం వల్ల, సామాన్యుల మధ్య ఉండాల్సిన సామరస్యం దెబ్బతింటోంది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టి, తద్వారా మరో వర్గంలో ప్రతిఘటన పెంచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే పోలరైజేషన్ రాజకీయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
డిప్యూటీ సీఎంపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఓ పాస్టర్
సనాతన ధర్మంతో పాటు.. పవన్ కల్యాణ్ పై అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశాడో ఓ పాస్టర్. ఈయనే కాదు చాలా మంది హిందూ దేవుళ్లను లక్ష్యంగా చేసుకుని చేసే అనుచిత వ్యాఖ్యలు సామాజిక విద్వేషానికి దారితీస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల కంటే, ఆ వ్యాఖ్యలు చేసిన మతానికి చెందిన సామాన్య ప్రజలే సమాజంలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో.. పరమతాన్ని దూషించకు అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, రాజకీయ అజెండాల కోసం చేసే విమర్శలు చివరకు మతం మారిన వారిని సామాజికంగా ఒంటరి చేసే ప్రమాదం ఉంది.
బలిపశువులుగా మారుతున్న సామాన్యులు
రాజకీయ పార్టీలు తమకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం ద్వారా ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. దీనివల్ల లాభపడేది రాజకీయ నాయకులే కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్లు కాదు. మతపరమైన చిచ్చు రేగినప్పుడు, ఆ గొడవల్లో చిక్కుకునేది, కేసులు ఎదుర్కొనేది సామాన్యులే. రిజర్వేషన్లు ఇతర చట్టపరమైన అంశాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ కుట్రల్లో భాగస్వాములు కావడం వారి భవిష్యత్తును మరింత ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది.
మేల్కోవాల్సిన సమయం
ప్రజాస్వామ్యంలో ఏ మతస్థులైనా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం తప్పు కాదు, కానీ అది విద్వేష పూరితంగా ఉండకూడదు. రాజకీయ నాయకులు తమ పడగ నీడన ఉంచుకుని చేసే ప్రయోగాలు విఫలమైతే, చివరకు నష్టపోయేది ఆ వర్గాలే. మతం మారిన వారు తమ విశ్వాసాలను వ్యక్తిగతంగా పాటిస్తూనే, రాజకీయ వ్యూహాలను పసిగట్టాలి. తమను ముందు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం, సనాతన ధర్మం పట్ల గౌరవం కలిగి ఉండటం ద్వారానే సామాజిక శాంతి సాధ్యమవుతుంది. లేనిపక్షంలో, వారు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం వాడి పారేసే బలిపశువులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని వారు గుర్తించాల్సి ఉంది.
