లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే ఇక దర్యాప్తులు, విచారణలు ఏళ్లకేళ్లు జరిపించడం ఎందుకో ఎవరికీ తెలియదు. కానీ ఉద్యోగుల విషయంలో అదే జరుగుతోంది. ప్రజల్ని పట్టి పీడించే ఉద్యోగులు దొరికినా వారికి శిక్షలు పడటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పని జరగని పరిస్థితి నెలకొంది. ఏసీబీ అధికారులు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మెరుపు దాడులు చేస్తూ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. కానీ, ఈ అరెస్టులు కేవలం కొద్ది రోజుల సస్పెన్షన్‌కు మాత్రమే పరిమితమవుతున్నాయి. అరెస్టయిన అధికారి కొద్ది నెలల తర్వాత మళ్లీ అదే కుర్చీలోనో లేదా అంతకంటే కీలకమైన పోస్టింగ్లోనో ప్రత్యక్షమవుతున్నారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం అధికారుల్లో లేకపోవడానికి, వ్యవస్థలో పేరుకుపోయిన జాప్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
విచారణల పేరుతో కాలయాపన
2021లో సమాచార హక్కు చట్టం ద్వారా పోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వివరాలు సేకరించింది. రెవెన్యూ శాఖలో ఏకంగా 323 ఏసీబీ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. వీటిలో పదేళ్ల క్రితం నమోదైన కేసులు కూడా ఉన్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు కేవలం 5 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయని, మిగిలిన 318 కేసులు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. ఒక అధికారి అవినీతి కేసులో పట్టుబడగానే 48 గంటల్లో సస్పెండ్ చేయడం ఒక నిబంధన. ఈ సస్పెన్షన్ కేవలం తాత్కాలికమే. ఏసీబీ తన విచారణ ముగించి ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి, ప్రభుత్వం ఆ అధికారిని విచారించేందుకు అనుమతి ఇవ్వడానికి ఏళ్ల సమయం పడుతోంది. సచివాలయం స్థాయిలోనే ఈ నివేదికలు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం, అవినీతి అధికారులకు వరంగా మారుతోంది.
దొరికినా ప్రభుత్వాలు ఎందుకు విచారణకు అనుమతి ఇవ్వవు?
90 రోజుల తర్వాత సస్పెన్షన్ రివ్యూ పేరుతో కేసు విచారణలో ఉంది కాబట్టి, సేవలను వినియోగించుకోవచ్చు అనే సాకుతో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇది ఒక రకంగా అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లేన. శిక్షలు పడుతున్న రేటు చాలా తక్కువ. ఒకే అధికారి రెండు మూడు సార్లు ఏసీబీకి దొరికినా, వారిపై కఠిన చర్యలు ఉండటం లేదు. దీనికి కారణం విచారణలో సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సుదీర్ఘ కాలం పాటు కేసు సాగదీయడం. సచివాలయంలోని పైస్థాయి అధికారులు తమ కింది సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మారినా, వ్యవస్థలో మార్పు రాకపోవడానికి పాలకులకు ఉన్న రాజకీయ అవసరాలు లేదా అధికారులపై ఉన్న పట్టు లేకపోవడమే కారణమని ప్రజలు భావిస్తున్నారు.
వ్యవస్థ ప్రక్షాళన ఎప్పుడు?:
కేవలం అధికారులను అరెస్ట్ చేస్తే సరిపోదు, వారు తిరిగి విధుల్లో చేరకుండా కఠినమైన నిబంధనలు ఉండాలి. ఏసీబీ పట్టుకున్న అధికారులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఏడాదిలోపే శిక్ష పడేలా చూడాలి. ప్రాసిక్యూషన్ అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, పక్కా ఆధారాలు ఉన్నప్పుడు వెంటనే అనుమతి ఇచ్చే అధికారం స్వతంత్ర సంస్థలకు ఉండాలి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే, ముందుగా సచివాలయంలో పెండింగ్‌లో ఉన్న వందలాది ఏసీబీ, విజిలెన్స్ ఫైళ్లను పరిష్కరించాలి. లేనిపక్షంలో, ఏసీబీ చేసే దాడులు కేవలం టీవీ వార్తలకు మాత్రమే పరిమితమవుతాయి తప్ప, సమాజంలో అవినీతి అంతం కాదు.
