దిల్ రాజు కి గతేడాది పెద్ద దెబ్బలే తగిలాయి. వాటి నుంచి మెల్లగా కోలుకొని, సరైన దారిలో వెళ్లడానికి ఆయన కష్టపడుతూనే ఉన్నారు. అయితే రిస్క్ తీసుకోవడం మాత్రం ఆపలేదు. ఇప్పుడు తన కెరీర్ లో మరో పెద్ద రిస్క్ చేశారు. యశ్ నటించిన ‘టాక్సిక్’ తెలుగు రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. అందుకు గానూ.. రూ.120 కోట్లు నిర్మాతలకు చెల్లిస్తున్నారన్నది టాక్. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ప్రకటించింది. తెలుగు రైట్స్ ని రూ.120 కోట్లకు దిల్ రాజు కైవసం చేసుకొన్నారంటూ అధికారికంగా ఓ పోస్టర్ వదిలింది. ఓ డబ్బింగ్ సినిమాకు రూ.120 కోట్లు పెట్టడం అంటే మాటలు కాదు.
కాకపోతే.. యశ్ క్రేజ్ పెరిగింది. ‘కేజీఎఫ్’తో ఆయన తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు. ‘కేజీఎఫ్ 2’కి కూడా మంచి వసూళ్లు దక్కాయి. అయినప్పటికీ రూ.120 కోట్ల తో సినిమా కొనడం అనేది రిస్క్ గానే చూస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. పైగా.. అదే రోజున ‘ధురంధర్ 2’ కూడా రిలీజ్ అవుతోంది. ‘ధురంధర్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీ చూసిన తరవాత ఈ సినిమాకు మరింత మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈసారి పార్ట్ 2ని తెలుగులోనూ పెద్ద ఎత్తున విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అదే జరిగితే ‘టాక్సిక్’ కి పెద్ద పోటీ తప్పదు. ఈ విషయం దిల్ రాజుకి సైతం తెలుసు. అయినా సరే.. ఇంత రేటుతో ఈ సినిమాని కొనేశారు. ‘టాక్సిక్’ గ్లింప్స్ క్రేజీగా అనిపించింది. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ స్టఫ్.. ఎక్కితే బాక్సాఫీసు దగ్గర మంచి నెంబర్లు చూసే అవకాశం ఉంది. ఆ ధైర్యంతోనే దిల్ రాజు ఈ సినిమాని ఇంత రేటు పెట్టి కొన్నారేమో…? ఈ యేడాది దిల్ రాజు నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే. మరి..2026 దిల్ రాజుని ఏ వైపు నడిపిస్తుందో తెలియాలంటే ‘టాక్సిక్’ వచ్చేంత వరకూ ఆగాలి.


