తెలుగు సినిమాలో త్రివిక్రమ్ ట్రెండ్ సెట్టర్. ముళ్లపూడి, జంధ్యాల తర్వాత తెలుగు సినిమా డైలాగ్, ప్రాసను కొత్త దారిపట్టించిన రచయితల్లో ఆయనది ప్రత్యేక శైలి. చిన్న చిన్న వాక్యాల్లోనే జీవిత సత్యాలు చెప్పేయడం, చిన్న ప్రాసతో నవ్వించడం, అదే సమయంలో ఆలోచనలో పడేయడం త్రివిక్రమ్‌కే చెల్లింది. ఆయన దర్శకుడిగా మారిన తర్వాత తెలుగు నుడికారం మరింత సొగసుగా మారింది. ఆయన ఎంచుకునే కథలు, ఇతివృత్తాలు కూడా తెలుగు సమాజానికి దగ్గరగానే సాగాయి. అందులో చాలావరకు కుటుంబకథా చిత్రాలే. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది.
అయితే రానురాను ఆయన క్రియేట్ చేసిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ రొటీన్‌గా మారిపోవడం మొదలయ్యాయి. ఫిల్మ్ మేకర్‌గా ఆయన్ని ఛాలెంజ్ చేసుకునే ప్రాజెక్ట్స్ చేయడం లేదనే కామెంట్స్ వినిపించాయి. నిజానికి ఒక రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌లో చాలా పొటెన్షియల్ ఉంది. అది ఆయనతో దగ్గరగా ప్రయాణం చేసిన వాళ్లకు ఆయన క్యాలిబర్ ఇంకా బాగా తెలుసు. ఆయనకున్న వరల్డ్ సినిమా నాలెడ్జ్ అమోఘం. ఆయనతో సరదాగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కొన్ని సినిమాల గురించి, కథల గురించి ఆయన ఇచ్చే విశ్లేషణలు వింటే మతిపోతుంది. కానీ అంత సబ్జెక్ట్ డెప్త్ ఉన్న త్రివిక్రమ్ ఎందుకో ఒకటే జానర్, అవే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కే పరిమితమైపోయారని ఫీలింగ్ చాలామందిలో ఉంది. ఆయన జానర్ మార్చి ఒక కొత్త స్టైల్లో సినిమా తీస్తే బాగుంటుందనే అభిప్రాయం ఎప్పటినుంచో విమర్శకుల్లో ఉంది.
అయితే ఇప్పుడా మార్పు మొదలైంది. త్రివిక్రమ్ తన జానర్ మార్చేసి ఒక యాక్షన్ థ్రిల్లర్ కథ చెప్పాలని ఫిక్స్ అయ్యారు. అదే వెంకటేశ్‌తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాకు ‘ఏకే 47’ అనే సబ్‌టైటిల్ కూడా ఉంది. టైటిల్ ఫాంట్లో ఆయన ఇచ్చిన బ్లడ్ కలర్ సినిమా జానర్‌ని ప్రెజెంట్ చేస్తుంది. ఇప్పటివరకు త్రివిక్రమ్ థ్రిల్లర్ సినిమాలు టచ్ చేయలేదు. ఆయన టైటిల్లో రక్తం ఛాయలు కనిపించడం ఇదే తొలిసారి. కెరీర్లో ఫస్ట్ టైమ్ ఫ్యామిలీ థ్రిల్లర్‌ని రాశారు. నిజంగా ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ నుంచి ఇదే కొత్తదనం కోరుకుంటున్నారు. ఆయన ఆయన స్టైల్లో ఒక థ్రిల్లర్ చేస్తే చూడాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.
నిజానికి వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మరో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ లాంటి సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ ఈసారి పూర్తిగా తన జానర్ మార్చేస్తూ ‘ఏకే 47’ తీస్తున్నారు. ఈ సినిమాతో ఆయన ఇచ్చే సర్‌ప్రైజ్‌ల కోసం ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
