టీఆర్ఎస్‌కు రూ. 255 కోట్ల నిధి..! తగ్గొద్దని కేసీఆర్ సూచన..!

తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు…వివిధ జిల్లా పార్టీ ఇంచార్జీలు హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పై చర్చించారు. జూన్ 24 న జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమి పూజ నిర్వహించారు. దసరాలోపు ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, వరంగల్ రూరల్ మినహా పార్టీ కార్యాలయాల డిజైన్లతో పాటు ఒక్కో కార్యాలయానికి 60 లక్షల చొప్పున చెక్కుల‌ను జిల్లా ఇంచార్జీ నేతలకు గులాబీ బాస్ అందించారు.

వందేళ్ళు నిలిచే విధంగా టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం ఉండాల‌ని జిల్లా ఇంచార్జీల‌కు కేసీఆర్ సూచించారు. ఎక‌రా స్థలంలో భ‌వ‌నాలు నిర్మిస్తున్నందున .. స‌క‌ల సౌక‌ర్యాలతో నిర్మించాల‌ని సూచించారు. మొత్తం పార్టీ నిధులు రూ. 255 కోట్ల రూపాయ‌లున్నట్లు కేసీఆర్ నేత‌ల‌కు చెప్పారు. నిధుల‌కు ఎలాంటి సమ‌స్య లేనందున పార్టీ కార్యాల‌యాల నిర్మాణానికి వ్యయం ఎక్కువైనా అన్ని హంగులతో నిర్మించాలని సూంచిచారు. ద‌స‌రాకే ప్రారంభించే విధంగా నేత‌ల‌కు టార్గెట్ పెట్టారు. ఒక్కొక్క కార్యాల‌యంలో మీటింగ్ హాల్‌, గెస్ట్ రూంలు, జిల్లా అధ్యక్షుడి చాంబ‌ర్‌, పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని సూచించారు. జిల్లా కార్యాల‌యాల్లో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించుకునే ఏర్పాట్లు ఉండాలన్నారు.

ముఖ్యనేతల సమావేశంలో ఎక్కువ సేపు పార్టీ కార్యాలయాల గురించే చెప్పారు. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాలని ఆదేశించారు. 32 జిల్లాల్లోనూ పార్టీ కార్యలయాలు.. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉండాలన్నారు. అయితే.. రానున్న మున్సిపల్ ఎన్నికలు, సవాల్ గా మారుతున్న బీజేపీ వంటి అంశాలపై మాత్రం పెద్దగా చర్చించలేదు. బీజేపీని అసలు పరిగణనలోకి తీసుకోవద్దని నేతలకు చెప్పేశారు. సభ్యత్వంపై మరింత కేర్ తీసుకోవాలని సూచించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com