డాలస్‌లో ఓ హోటల్ మేనేజర్‌గా ఉన్న భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు దారుణంగా హత్యచేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. హంతకుడు అక్రమ వలసదారుడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బైడెన్ పాలనలో అక్రమ వలసవాదులపై జాలి చూపించే విధానాల కారణంగానే ఆ వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడని .. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదనిప్రకటించారు.
చంద్ర నాగమల్లయ్య హత్య గురించి తెలుసుకున్నానని.. అతనికి డల్లాస్‌లో మంచి పేరు ఉందన్నారు. అతని భార్య, కుమారుడి ముందే క్యబా నుంచి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి చంపేశారని.. ఈ వ్యక్తిపై అంతకు ముందు తీవ్ర నేరాభియోగాలు కూడా ఉన్నాయన్నారు. క్యూబా ఇలాంటి వాళ్లను తమ దేశంలో ఉంచుకోదని.. కానీ బైడెన్ మాత్రం.. వలసవాదులపై ఉదారం చూపి ఇలాంటి నేరగాళ్లను అమెరికాలో ఉంచేశాడన్నారు. అక్రమ వలసదారులందర్నీ బయటకు పంపేసి.. అమెరికాను సురక్షితం చేస్తామన్నారు.
మా కస్టడీలో ఉన్న ఈ నేరస్థుడిని చట్టపరంగా పూర్తి స్థాయిలో శిక్షిస్తాం. అతనిపై మొదటి డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశామని ట్రంప్ ప్రకటించారు. ఈ హత్యకేసులో నిందితుడు అక్రమ వలసదారుడు కావడంతో .. సరైన పత్రాలు లేకుండా అమెరికా లో ఉండే వారందరిపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్ సర్కార్ మరింత కఠినంగా వ్యవహరించనుంది. నాగమల్లయ్య కుటుంబం కోసం.. ఫండ్ రైజింగ్ ద్వారా దాదాపు రెండుకోట్లను సేకరించారు.