అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌ను దివాలా తీయించారని ప్లాన్ చేస్తున్నారు. తాను మాట్లాడిన వీడియోను ట్విస్ట్ చేశారని ఏకంగా రూ.90వేల కోట్లకు దావా వేశారు. ఇప్పటికే ఆ విషయంలో బీబీసీ క్షమాపణలు చెప్పింది. కారణమైన ఉద్యోగుల్ని తొలగించింది. అయినాసరే ట్రంప్ కు ఇదో ఆదాయవనరుగా కనిపించింది. దావా వేసేశారు.
ఎన్నికల సమయంలో తనపై దుష్ప్రచారం చేశారని, పక్షపాత వైఖరితో వార్తలు రాశారని ట్రంప్ న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రధానంగా అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా బీబీసీ వ్యవహరించిందని వారి ప్రధాన ఆరోపణ. ట్రంప్ తరపు న్యాయవాదులు పంపిన నోటీసుల ప్రకారం.. బీబీసీ తన రిపోర్టింగ్‌లో ట్రంప్‌ను ఒక విలన్‌గా చిత్రీకరించడమే కాకుండా, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేసిందని పేర్కొన్నారు. . కేవలం బీబీసీ మాత్రమే కాకుండా, మరికొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలపై కూడా ఆయన ఇలాంటి చర్యలకే సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలను బీబీసీ తోసిపుచ్చింది. తాము ఎప్పుడూ నిష్పాక్షికంగా, అత్యున్నత జర్నలిజం ప్రమాణాలకు కట్టుబడి వార్తలను అందిస్తామని స్పష్టం చేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో నాయకుల పనితీరును విశ్లేషించడం , ప్రశ్నించడం మీడియా బాధ్యత అని, ఇందులో ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ట్రంప్ సిఎన్ఎన్ , న్యూయార్క్ టైమ్స్ వంటి సంస్థలపై కోర్టుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈసారి ఏకంగా రూ. 90 వేల కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసి… ఔరా ట్రంప్ అనిపిస్తున్నారు.
