చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం భావిస్తోందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌లు ముగిసిన ద‌గ్గ‌ర్నుంచీ నేరుగా ఎన్నిక‌ల సంఘంపైనే పోరాటానికి ఎక్కుపెట్టారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న స్పందిస్తున్నారు. అయితే, ఇదేదో ఏపీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన వ్య‌వ‌హారంగా కాకుండా… ఎన్నిక‌ల సంఘం తీరుపై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రిగే విధంగా చేస్తున్నారు. ఏపీలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ఈవీఎం మొరాయింపులు, ఈసీ నిర్వ‌హ‌ణ‌ తీరు, పోలింగ్ కేంద్రాల్లో అర‌కొర ఏర్పాట్లు, అర్ధ‌రాత్రి వ‌ర‌కూ పోలింగ్‌… వీటిపై జాతీయ పార్టీల నేత‌ల‌తో ఢిల్లీలో చంద్ర‌బాబు స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఈవీఎం విధానంలో వ్య‌క్త‌మౌతున్న లోపాల‌ను కూడా ఎత్తి చూపుతున్నారు. దీంతో ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం ఆయ‌న్ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నాలు ఆరంభించిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మౌతున్నాయి.

రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వివేదీతో సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరుపై నేరుగా ఈసీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, ఈ స‌మావేశానికి సంబంధించిన స‌మ‌గ్ర వివ‌రాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం కోరిన‌ట్టు స‌మాచారం. ద్వివేదీతో భేటీ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయ‌డు ఏం మాట్లాడారు అనేది ఇంగ్లిష్ అనువాదంలో నివేదిక కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ భేటికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఉంది. అయితే, దాన్లో సంభాష‌ణ‌లు తెలుగులో ఉన్నాయి. కాబ‌ట్టి, త‌ర్జుమా చేసి పంపాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. దీంతోపాటు ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న అన్ని ప‌రిణామాల‌పై కూడా స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని ఛీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే, దీనికి సంబంధించి కూడా వైకాపా ఫిర్యాదు ఒక‌టుంది! ద్వివేదీతో చంద్ర‌బాబు భేటీ అయిన త‌రువాత‌… ద్వివేదీని చంద్ర‌బాబు నాయుడు బెదిరించారంటూ వైకాపా నేత‌లు ఒక ఫిర్యాదు ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని చంద్ర‌బాబు-ద్వివేదీ భేటీపై దృష్టిసారించారేమో అనే అభిప్రాయ‌మూ వ్య‌క్త‌మౌతోంది. ఏదేమైనా, ఎన్నిక‌ల సంఘం తీరుపై చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం ఆంధ్రాలోనే కాదు, ఇత‌ర రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు కూడా అక్క‌డా మాట్లాడుతున్నారు. ఇదంతా గ‌మ‌నించిన ఈసీ… చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయాల‌ని భావిస్తోంద‌నీ, అందుకే ఏదో ఒక పాయింట్ కోసం వెతుకులాట మొద‌లుపెట్టింద‌నేది కొంత‌మంది అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com