ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. 22న విజయసాయిరెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. మిథున్‌రెడ్డిని 23వ తేదీన రావాలని ఈడీ కబురు చేసింది. జగన్ హయాంలో అటు విజయసాయిరెడ్డి, ఇటు మిథున్‌రెడ్డి లిక్కర్ వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. మధ్యలో విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినా మిథున్‌రెడ్డి మాత్రం చివరి వరకూ ఆ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు.
ఇప్పటికే లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5గా ఉన్నారు. కానీ ఆయన తనను తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకుని ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌కు అన్ని వివరాలు చెబుతూ సహకరిస్తున్నందున అరెస్టు చేయలేదు. కానీ మిథున్‌రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా రిలీఫ్ దొరకక తప్పనిసరిగా అరెస్టయ్యారు. అనూహ్యంగా ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనపై ఈడీ గురి పెట్టింది.
లిక్కర్ స్కాం డబ్బులు లాండరింగ్ చేయడంలో మిథున్‌రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి అని సిట్ గుర్తించింది. స్కాం డబ్బుల్ని సేకరించడం…రూటింగ్ చేయడం.. వారం వారం వచ్చి జగన్ కు లెక్కలు చెప్పడం అన్నీ ఆయనచేసే వారన్న ప్రచారం ఉంది. ఈ లెక్కలన్నీ ఈడీ బయటకు తీసి ఆయనను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తాను బలి కాకూడదని అనుకుంటున్నారు కాబట్టి… మొత్తం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఈడీకి వీరంతా దొరికిపోతారు.
