ఆంధ్రప్రదేశ్లో నూతన భవన నిర్మాణాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పురపాలక చట్టంలో కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువ ఆధారంగా మున్సిపాలిటీలు పన్ను వసూలు చేస్తాయి. అయితే, భవన నిర్మాణం కోసం ప్లాన్ అప్రూవల్ తీసుకున్న సమయం నుండి ఆ భవనం పూర్తిస్థాయిలో నిర్మితమయ్యే వరకు పన్ను చెల్లింపుదారులపై భారీ భారం పడుతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, నిర్మాణ కాలంలో ఖాళీ స్థలం పన్నులో 50 శాతం రాయితీ కల్పిస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది. దీనికి అనుగుణంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తాజాగా అధికారిక జీవో జారీ చేశారు.
ఈ కొత్త నిబంధన ప్రకారం, యజమానులు భవన నిర్మాణ అనుమతి పొంది పనులు ప్రారంభించినప్పటి నుండి, భవనం పూర్తయ్యాక మున్సిపల్ అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే వరకు ఈ 50 శాతం రాయితీ వర్తిస్తుంది. గతంలో నిర్మాణం జరుగుతున్న సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఖాళీ స్థలం పన్ను కట్టాల్సి వచ్చేది. తాజా సవరణతో నిర్మాణ దశలో ఉన్న ఆస్తులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. ఇది కేవలం పెద్ద డెవలపర్లకే కాకుండా, సొంత ఇల్లు నిర్మించుకునే సామాన్యులకు కూడా పెద్ద ఊరటగా మారనుంది.
రాష్ట్రంలో సులభతర వాణిజ్యం , రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించిన చట్ట సవరణల ప్రకారం మున్సిపల్ చట్టాల్లోని సెక్షన్లను సవరిస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఆదాయానికి గండి పడకుండానే, ప్రజలపై అనవసర పన్ను భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భవనం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, సదరు ఆస్తిపై సాధారణ ఆస్తి పన్ను వర్తిస్తుంది, అప్పటి వరకు కేవలం సగం వీఎల్టీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ఈ జీవో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేషన్లు , మున్సిపాలిటీలలో అమల్లోకి రానుంది. ఆన్లైన్ ప్లాన్ అప్రూవల్ సిస్టమ్లో కూడా ఈ రాయితీని ప్రతిబింబించేలా మార్పులు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. దీనివల్ల పన్ను చెల్లింపుల్లో అవినీతికి తావు లేకుండా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


