“రాజకీయాల్లోకి వచ్చే మహిళల్లో 90 శాతం మంది పురుష నేతల బెడ్రూమ్స్ నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు” .. ఈ మాట అన్నది ఎవరో కాదు.. మహిళా రిజర్వేషన్ల బిల్లును చట్టంగా మార్చాల్సిన ఎంపీ. బీహార్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ఎంపీ పప్పూ యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరోసారి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలు కేవలం మహిళా నేతలను అవమానించడమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థనే కించపరచడం. మహిళలు తమ మేధస్సుతో, పోరాట పటిమతో రాజకీయాల్లోకి రావడం లేదని, కేవలం లైంగిక దోపిడీ ద్వారానే పదవులు పొందుతున్నారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం ఆయన వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది.
రౌడీ ఇమేజ్‌తో రాజకీయ ప్రస్థానం
పప్పూ యాదవ్ రాజకీయ చరిత్ర రక్తసిక్తమైన నేరాల మయం. దాదాపు 30కి పైగా క్రిమినల్ కేసులు, అందులో హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సీపీఎం నేత అజిత్ సర్కార్ హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడిగా ఉండి, సుదీర్ఘ కాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలులో ఉండి కూడా తన నెట్‌వర్క్‌ను నడిపించిన చరిత్ర ఆయనది. బిహార్‌లోని కోసీ ప్రాంతంలో తనకంటూ ఒక బాహుబలి ఇమేజ్ను సృష్టించుకుని, భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల్లో గెలవడం ఆయన శైలి. రౌడీయిజాన్ని రాజకీయ బలంగా మార్చుకున్న ఇలాంటి వ్యక్తులు మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారు.
చట్టసభల్లో నేరస్థుల ప్రాబల్యం
ఒకవైపు దేశం నారీ శక్తి గురించి గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో, మరోవైపు చట్టసభల్లో కూర్చునే ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. పప్పూ యాదవ్ లాంటి వారు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.. మహిళలు స్వతంత్రంగా ఎదగకూడదనే ధోరణి. నేరచరితులు, అరాచకవాదులు చట్టసభల్లో ఉన్నంత కాలం మహిళలకు నిజమైన న్యాయం జరగడం అసాధ్యం. చట్టం చేసే స్థానంలో ఉన్నవారే చట్టాన్ని, నైతికతను తుంగలో తొక్కినప్పుడు సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది.
పప్పూ యాదవ్ మరిన్ని మాటలు అంటారు.. ఏమీ చేయలేం!
పప్పూ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించి నోటీసులు జారీ చేసింది. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు సిఫార్సు చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఆయనను ఏమీ చేయలేరు. నేరచరితులైన నాయకులకు ఓట్లు వేసి గెలిపించినంత కాలం చట్టసభల్లో ఇలాంటి అరాచకమైన భాష వినబడుతూనే ఉంటుంది. ఈ ధోరణి మారాలంటే ఓటరు విజ్ఞతతో పాటు, రాజకీయ పార్టీలు నేరచరితులకు టికెట్లు ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
