పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. బెంగాల్ ఎన్నికలంటేనే అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో అన్నీ పోలింగ్ స్టేషన్లూ సమస్యాత్మకమైనవే. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం రెండు విడతల్లోనే పోలింగ్ ప్రక్రియను ముగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో ఏకంగా 152 నియోజకవర్గాలకు గురువారంపోలింగ్ జరగనుంది. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, డార్జిలింగ్, జల్పాయ్గురి నుంచి మొదలుకొని దక్షిణ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, పశ్చిమ మేదినీపూర్ వరకు విస్తరించి ఉన్న ఈ స్థానాలు అధికారాన్ని నిర్ణయించడంలో కీలకం.
మొదటి విడతలో నందిగ్రామ్ వంటి హై-ప్రొఫైల్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. బెంగాల్ ఎన్నికలంటేనే హింస కామన్. ఈ సారి దాదాపు 15,000 పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ముఖ్యంగా ముర్షిదాబాద్ ,ఉత్తర బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. డ్రోన్ నిఘా , వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తున్నారు.
ఈసారి పోరు బెంగాలీ అస్థిత్వం,అభివృద్ధి చుట్టూ తిరుగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తమ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్న డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్‌లపై ధీమాగా ఉంది. మరోవైపు, బీజేపీ రాష్ట్రంలో గత 14 ఏళ్లుగా పరిశ్రమలు తరలిపోతున్నాయని, నిరుద్యోగం పెరిగిందని మమత సర్కార్‌ను ఇరుకున పెడుతోంది. మొదటి విడతలో పట్టున్న ప్రాంతాల్లో బీజేపీ సత్తా చాటాలని చూస్తుండగా, మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ వంటి చోట్ల టీఎంసీ తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతానికి బెంగాల్లో పోరు అత్యంత హోరాహోరీగా ఉంది. బెంగాలీ మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం, టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో , యువతలో బీజేపీ పట్ల కొంత సానుకూలత కనిపిస్తోంది. అయితే, మమతా బెనర్జీ స్వయంగా ప్రచార బరిలో దూసుకుపోవడం టీఎంసీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. మొదటి విడతలో ఎవరైతే 80 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తారో, వారికే బెంగాల్ పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెక్యులర్ ఓట్ల చీలిక జరిగితే అది బీజేపీకి వరంగా మారే అవకాశం ఉందని, అలా కాకుండా ఓట్లు కేంద్రీకృతమైతే టీఎంసీ హ్యాట్రిక్ విజయం దిశగా వెళ్తుందని భావిస్తున్నారు.
