అమెరికాలో సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. అమెరికా కాంగ్రెస్ గత నెలలో ఆమోదించిన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం, డిసెంబర్ 19వ తేదీ అర్ధరాత్రిలోపు కేసుతో సంబంధం ఉన్న అన్ని పత్రాలను బహిర్గతం చేయాలని గడువు విధించారు. ఈ చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 19న సంతకం చేశారు. ఆ 30 రోజుల గడువు ముగియడంతో న్యాయ శాఖ వేలాది పేజీల పత్రాలను, ఫోటోలను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
అయితే వెబ్సైట్లో మొదట అప్లోడ్ చేసిన ఫైళ్లలో కొన్ని అకస్మాత్తుగా కనిపించకుండా పోయాయని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్ కలిసి ఉన్న ఒక ఫోటోతో పాటు సుమారు 16 ఫైళ్లు డిలీట్ అయ్యాయని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫోటోలలో ఎప్స్టీన్ తన విలాసవంతమైన జీవితంలో భాగంగా అనేకమంది ప్రముఖులతో కలిసి ఉన్న దృశ్యాలు ఉన్నాయి.
మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ , ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపంలో ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. మైఖేల్ జాక్సన్, మిక్ జాగర్, డయానా రాస్ వంటి హాలీవుడ్ ప్రముఖులతో పాటు బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల ఫోటోలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన సుమారు 1,30,000 పేజీల పత్రాల్లో చాలా చోట్ల పేర్లు, వివరాలను నల్లటి సిరాతో చెరిపివేశారు . బాధితుల గోప్యతను కాపాడటం కోసమే ఇలా చేశామని అధికారులు చెబుతున్నారు.
ఇది మొదటి విడత మాత్రమేనని, రాబోయే వారాల్లో మరిన్ని లక్షల పత్రాలను విడుదల చేస్తామని అమెరికా న్యాయశాఖ చెబుతోంది. ఎప్స్టీన్ మరణం వెనుక ఉన్న మిస్టరీని, ఆయన దశాబ్దాల పాటు శిక్ష పడకుండా ఎలా తప్పించుకున్నారనే విషయాలను ఈ ఫైల్స్ బయటపెడతాయని భావిస్తున్నారు.
