ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడ్చారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తూంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా ఆలోచించుకోవాలని ఆయన ఆవేదన చెందారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో లాటరీలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెల్చుకుంది. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలని ఆయన ఫీలయ్యారు. ఆయన మున్సిపల్ కార్యాలయానికి వెళ్లకుండా..పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉంచారు. సుదీర్ఘ కాలం పాటు తొర్రూరు ఎర్రబెల్లి కనుసన్నల్లోనే ఉండేది. ఈ ఫలితం కోలుకోలేని దెబ్బ తీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. తన కేడర్‌ను కాపాడుకోవడానికి ఎర్రబెల్లి క్యాంపు స్థలాలను మారుస్తూ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ కౌన్సిలర్ తూనం శ్రవణ్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచింది. కాంగ్రెస్‌కు ఏడు కౌన్సిలర్ సీట్లు వచ్చాయి. దీంతో చైర్మన్ పదవి బీఆర్ఎస్కే దక్కాల్సి ఉంది.కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఓట్లు చెరో ఎనిమిదికి చేరుకున్నాయి. ఎక్స్ ఆఫీషియోగా కడియం కావ్య ఓటు వేయాలనుకున్నా వివాదం వల్ల ఆమె వేయలేదు. దాంతో ఫలితం టైం అయింది. చివరికి లాటరీ వేస్తే అది కాంగ్రెస్ కు వెళ్లింది. అజేయంగా ఉన్న ఎర్రబెల్లిని గత ఎన్నికల్లో 26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించారు. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలోనూ ఓడించి కన్నీరు పెట్టించారు.
ఈ రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ముందు బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అసహ్యం కలిగిస్తున్నాయని, విలువలు లేని రాజకీయాల్లో తానూ కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని చెబుతూ ఆయన బావోద్వేగానికి లోనయ్యారు.