తెలంగాణలో కులం, మతం రాజకీయాలు పని చేయవన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది బండి సంజయ్ ను టార్గెట్ చేసినట్లుగానే భావిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. ఈ ఎన్నిక బాధ్యతను కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకున్నారు. బండి సంజయ్ పూర్తిగా మతం ఆధారంగా ప్రచారం చేశారు. ముస్లిం టోపీ ధరించాల్సి వస్తే తల తీసుకుంటానే ప్రకటనలు చేశారు.
ఎన్ని చేసినా బీజేపీ రేసులో లేకపోవడంతో ఓటర్లు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన అరవై మూడు వేల ఓట్లలో యాభై వేల ఓట్లకు కోతపడింది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పెద్దగా ప్రచారం చేయలేదు. గ్రేటర్ పరిధిలోని స్థానానికి ఎంపీగా ఉన్నా ఆయన పాత్ర పరిమితంగా ఉంది. ఎవరూ ప్రచారంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కూడా అడగలేదు.
ఈ క్రమంలో జూబ్లిహిల్స్ తీర్పుపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విభజిత రాజకీయాలకు కేంద్రంగా ఉంటాయని అలాంటివి తెలంగాణలో పని చేయవని చెబుతున్నారు. అంటే బండి సంజయ్ మార్క్ అవసరం లేదని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇరువురు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం.. బీసీ నేతలు కావడంతో.. అవకాశాల విషయంలో వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అవి అంతకంతకూ పెరుగుతున్నాయి.
