ఏపీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారంటూ సోషల్ మీడియాలో జీవో వైరల్ అయింది. అందరూ ఆశ్చర్యపోయారు. కేబినెట్ సమావేశాల్లో కానీ.. బయట కానీ ఈ అంశంపై ప్రభుత్వంలో చర్చ జరిగినప్పుడు ఎప్పుడూ బయటకు రాలేదు. అసలు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని అధికారిక సమాచారం ప్రభుత్వ వర్గాల నుంచి రాలేదు. కానీ జీవో మాత్రం వైరల్ అయింది. ప్రభుత్వ వర్గాలు ఈ ప్రచారాన్ని ఖండించడానికి సమయం తీసుకున్నాయి. వారి దృష్టికి రాలేదేమోకానీ తీరిగ్గా ఆ జీవోలు ఫేక్ అని ధృవీకరించాయి.
వైసీపీ హయాంలో ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. ఆ తర్వాత కూడా ఇలాంటి ఫేక్ జీవోలు బయటకు వచ్చాయి. పదవి విరమణ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు సజ్జల ఉద్యోగ సంఘాల వద్ద ప్రతిపాదించారని చెప్పుకున్నారు. అప్పట్లో కూడా ఫేక్ జీవోలు ప్రచారం అయ్యాయి. టీడీపీ వాళ్లపై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు కూడా ఇలాంటి జీవోలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రత్యేకంగా ముఠాలు ఉన్నాయన్నమాట.
ఉద్యోగ సంఘాలు పదవీ విరమణ పెంచాలనే కోరుకుంటాయి. కానీ బహిరంగంగా డిమాండ్ చేయలేవు. అందుకే ఇలాంటి ఫేక్ జీవోల ద్వారా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం .. ఇంకా చెప్పాలంటే.. పదవి విరమణ వయసును తగ్గించాలి. 58 ఉండే దానిని జీవన ప్రమాణాలు పెరిగాయని 62కు తీసుకెళ్లారు. కానీ యువత గురించి ఆలోచించడంలేదు. వారికి రిటైర్మెంట్ ఇచ్చి యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంటే.. కొత్త రక్తం వస్తుంది.. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది.