ఫ్యాక్షన్ సినిమాల్లో తరచూగా వినిపించే ఓ డైలాగ్ ఉంది.. ‘బండ్లు తీయండ్రా’ అని. శత్రువులపై దాడికి ఫ్యాక్షనిస్టులు (సినిమాల్లో మాత్రమే సుమా) ఈ డైలాగ్ వల్లేస్తుంటారు. ‘బండ్లు తీయండ్రా’ అంటే ఓ యాక్షన్ సీన్ కి అంకురార్పణ జరిగినట్టే.
చిత్రసీమలోనూ ఇలాంటి రొటీన్ డైలాగ్ వినిపిస్తుంటుంది. అదే.. ‘కథలు మార్చండ్రా’. ఓ సూపర్ హిట్ సినిమా వచ్చినప్పుడు, కల్ట్ లాంటి కథ చూసినప్పుడు, ఇండస్ట్రీని కుదిపేసే ప్రాజెక్ట్ పడినప్పుడు దర్శకులు, హీరోలు, కథకుల మైండ్ అల్లకల్లోలం అయిపోతుంటుంది.
ఖైదీ, శివ, సమరసింహారెడ్డి, పోకిరి, హ్యాపీడేస్, అర్జున్ రెడ్డి.. ఇలాంటి సినిమాలే. కొన్నిసార్లు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన సినిమాలు ఇంకా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి సినిమా ఈమధ్యే వచ్చింది. అదే… ‘దురంధర్ 2’.
ఆదిత్యధార్ దర్శకత్వ ప్రతిభ, రణవీర్ సింగ్ నటన, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చేసిన కృషి… ఈ సినిమాని గొప్ప స్థానంలో నిలబెట్టాయి. వసూళ్ల పరంగా ఆల్ టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా సాగిపోతోంది. దాన్ని పక్కన పెడితే `దురంధర్` గురించి సినీ మేధావులు, సీనియర్ దర్శకులు గొప్పగా చెప్పుకొంటున్నారు. దీంతో సినిమా `రాత` మారిపోవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ఈమధ్య కాలంలో బాహుబలి తరవాత అంతటి ఇంపాక్ట్ ఇచ్చిన సినిమాగా `దురంధర్`ని ప్రస్తావిస్తున్నారు.
ఈ సినిమా ప్రభావం టాలీవుడ్ పై కూడా గట్టిగా పడింది. కొంతమంది దర్శకులు తాము రాస్తున్న కథల్ని పక్కన పెట్టి `దురంధర్ లాంటి స్పాన్లో సినిమా తీయాలి` అని మళ్లీ కొత్తగా కలం పట్టుకొన్నారట. ఓ దర్శకుడు ప్రస్తుతం స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. కథ కూడా ఫిక్సయ్యింది. అయితే దురంధర్ ఇంపాక్ట్ వల్ల రాసిన కథని పక్కన పెట్టి, మరో కొత్త కథ తయారు చేయడానికి రెడీ అయ్యాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. కొంతమంది హీరోలు తమ దర్శకుల్ని పిలిచి `దురంధర్ టైపు కథలు రాయండి` అని సలహాలు ఇస్తున్నార్ట.
శివ తరవాత కాలేజీ కథలు ఎక్కువయ్యాయి. సమరసింహారెడ్డి చూశాక, ఫ్యాక్షన్ స్టోరీలు వరుస కట్టాయి. అలానే.. ‘దురంధర్ 2’ తరవాత జాతియవాదం, ఉగ్రవాదం సంబంధించిన కథలు పోటెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో తప్పులేదు. కానీ ‘పులి – నక్కవాత’లా మారకూడదు. ‘దురంధర్ 2’ హిట్టయ్యిందంటే ఫార్ములాని బ్రేక్ చేసింది కాబట్టే. అలానే ఎప్పటికప్పుడు ఫార్ములాలు బ్రేక్ చేసే కథల్నే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయాన్ని గుర్తించాలి. ‘దురంధర్’ లాంటి కథలే తీస్తామంటే కుదరదు. ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకొని, అంత సీరియస్ ఎఫెక్ట్ పెట్టాలి. కథలు మార్చాల్సిందే. దానికంటే ముందు మైండ్ సెట్ మార్చాలి. దర్శకులు, రచయితలు కొత్తగా ఆలోచించాలి. అప్పుడే ప్రేక్షకులూ బ్రహ్మరథం పడతారు.


