ఏపీ లిక్కర్ స్కాంలో ప్రాథమిక చార్జీషీటును చాలా పక్కాగా కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు. కేవలం ఏం జరిగింది.. ఎలా జరిగిందని చెప్పడం కాకుండా.. ప్రతి దానికి ఫోరెన్సిక్ ఆధారాలు జత చేశారు. వందకుపైగా ఈ ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి. నోట్ల కట్టల గుట్టల దగ్గర నుంచి బంగారం కొనుగోళ్ల రికార్డుల వరకూ అన్నింటిని జత చేశారు.
ఈ స్కాంలో ఇప్పటి వరకూమొత్తంగా రూ. 62 కోట్లు సీజ్ చేసినట్లుగా సిట్ చార్జిషీట్లో తెలిపింది. 268 మంది సాక్షులను విచారించామని .. వందల కోట్ల నగదును బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారం షాపుల్లో పెట్టుబడిగా ఆధారాలు ఇచ్చింది. అసలు స్కాం ఎలా చేశారో కూడా వివరించారు. ప్రముఖ బ్రాండ్లను అణచివేసి క్కువ పేరున్న కొత్త బ్రాండ్లను అమ్మడం ద్వారా రూ. 3,200 కోట్ల లంచాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఆటోమేషన్‌ను నిలిపివేసి, మాన్యువల్ ఆర్డర్ ఫర్ సప్లై విధానాన్ని అమలు చేశారు. లంచాలు ఇచ్చిన బ్రాండ్లకే ఇండెంట్లు పెట్టారు.
లంచాల ద్వారా సేకరించిన నిధులు షెల్ కంపెనీలు , హవాలా నెట్‌వర్క్‌లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లు , లగ్జరీ ఐటెమ్‌ల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లుగా సిట్ ఆధారాలు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిథున్ రెడ్డి ప్రస్తావన ఉంది కానీ.. ఆయన చేసిన నేరం ఏమిటి.. డబ్బులు ఎలా లాండరింగ్ చేశాడన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. మరో ఇరవై రోజుల్లో మరో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.