రాష్ట్రపతి కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది. ఇవి రాజకీయాలకు అతీతమైన పదవులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పిస్తారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కళారంగం కోటాలో ఆయనను మరోసారి రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం జరిగింది.
చిరంజీవి ఆసక్తి చూపించలేదో లేకపోతే అసలు అలాంటి ప్రతిపాదన కేవలం మీడియాలో మాత్రమే ప్రచారం జరిగిందేమో కానీ.. చిరంజీవి పేరు లేకుండా నలుగుర్ని నామినేట్ చేశారు. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబై ఉగ్రదాడుల కేసు వంటి ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన ఉజ్వల్ దేవరావ్ నికమ్, కేరళకు చెందిన సీనియర్ సామాజిక కార్యకర్త విద్యావేత్త సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్‌ల, చరిత్రకారురాలు , విద్యావేత్త మీనాక్షి జైన్ ను నామినేట్ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) , 80(3) కింద రాష్ట్రపతి అధికారాలను ఉపయోగించి, ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలను భర్తీ చేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఈ కోటాలో తెలుగు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ తో పాటు సచిన్ టెండూల్కర్, మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ వంటి వారు నామినేట్ అయ్యారు. ఈ కోటాలో నామినేట్ అయ్యే వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదు.