సంక్రాంతి తరవాత టాలీవుడ్ కి హిట్ పడలేదు. కనీసం యావరేజ్ బొమ్మ కూడా రాలేదు. కానీ… చాలా సినిమాలే పలకరించి వెళ్లాయి. వారం వారం అరడజను సినిమాలు వస్తున్నాయి. గతవారం కూడా కూకుమ్మడిగా సినిమాలు దాడి చేశాయి. కానీ ఫలితం కనిపించలేదు. ఈవారం కూడా మూడు సినిమాలు రెడీ అయ్యాయి. మరి ఈసారైనా ప్రేక్షకులు కదులుతారా? థియేటర్లకు వస్తారా?
విశ్వక్ సేన్ – అనుదీప్ సినిమా ‘ఫంకీ’ ఈనెల 13న విడుదల అవుతోంది. మూడు సినిమాల్లో మంచి బజ్ ఉన్న సినిమా ఇదే. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్ లో ఫన్ పుష్కలంగా కనిపించింది. అనుదీప్ మార్క్ డైలాగులు నవ్విస్తున్నాయి. ఇన్నే నవ్వులు థియేటర్లలో కూడా ఉంటే, ఈ సినిమా హిట్ అయినట్టే. విశ్వక్ కి కూడా ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం.
సంతోష్ శోభన్ నుంచి వస్తున్న మరో సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. స్నేహం, ప్రేమ, ఎమోషన్స్… ఇవన్నీ కలగలిపినట్టు అర్థం అవుతోంది. ట్రైలర్ బాగుంది. తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సంతోష్ శోభన్ ఈమధ్య స్క్రిప్టుపై బాగా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. క్లైమాక్స్ కొంచెం షాకింగ్ గా ఉంటుందని టాక్. అది నచ్చితే సినిమా కూడా నచ్చేసినట్టే అనుకోవాలి.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన సినిమా ‘సీతా పయనం’. అర్జున్ కుమార్తె ఐశ్వర్య కథానాయిక. అర్జున్, ధృవ్ సర్జా అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ప్రేమలో కొత్త కోణం చూపించే ప్రయత్నం చేస్తున్నామని అర్జున్ చెబుతున్నారు. మరి ఆ కొత్త కోణమేమిటో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాలి. ఈ మూడు సినిమాల మధ్య మంచి పోటీ నెలకొంది. ఓపెనింగ్స్ పరంగా విశ్వక్ ముందుంటాడు. ఆ తరవాత టాక్ ని బట్టి మిగిలిన సినిమాలకు టికెట్లు తెగుతాయి. ఫిబ్రవరి తొలి వారంలో బాక్సాఫీస్ హిట్ చూడలేదు. రెండో వారం అయినా ఆ లోటు తీరుతుందేమో చూడాలి.
