దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కెపాసిటీ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పెళ్లి చూపులు’ తో న్యూ ఏజ్ సినిమా ఏమిటో చూపించాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు నటుడిగానూ బిజీనే. ఈమధ్య నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఖాతాలో మరో సినిమా చేరింది. అదే.. ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా టీజర్, ట్రైలర్ కలిపి.. ట్రైజర్ విడుదల చేశారు.
అమెరికా వెళ్లాలంటూ కలలు కనే అబ్బాయి కథ ఇది. అమెరికా విసా రిజెక్ట్ అవ్వడంతో… ఫస్ట్రేషన్కి గురవుతాడు. ఆ తరవాత ఏం చేశాడో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ట్రైజర్ అంతా ఫన్ రౌడ్ తో సాగింది. కేజీఎఫ్ స్పూఫ్.. అమెరికా వెళ్లకపోయినా తరుణ్ భాస్కర్ ఇచ్చే బిల్డప్పులు, మధ్యమధ్యలో కథకు అడ్డం పడే యాక్షన్ ఎపిసోడ్లూ.. వీటితో సరదా సరదాగా గడిచిపోయింది. తెల్లపిల్లి అంటూ… ట్రంప్ ని చూపించడం మరింత రిలవెంట్ గా ఉంది. అమెరికా వెళ్లాలనుకొన్న వారి ఆశలకు ట్రంప్ ఎలాంటి కళ్లెం వేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రంప్ నిబంధనల వల్ల గాయపడిన యువత ఆలోచనలకు, వాళ్ల ఆగ్రహానికి ఈ సినిమా ఓ ప్రతిరూపం అవుతుందేమో అనిపిస్తోంది. ‘డోంట్ లాఫ్.. ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అంటూ ఓ క్యాప్షన్ జోడించారు. సీరియస్ మేటరే.. కాకపోతే సరదాగా చెప్పినట్టు అనిపించింది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడిగా సక్సెస్ కొట్టిన తరుణ్ భాస్కర్ కు నటుడిగా ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.
