Gaayapadda Simham Movie Review
Gaayapadda Simham Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కొన్ని ఐడియాలు విన్నప్పుడు భలేగా అనిపిస్తాయి. కచ్చితంగా అవుటాఫ్ ది బాక్స్ అనుకొంటాం. కానీ.. అలాంటి ప్రతీ ఐడియా ఓ విజయవంతమైన సినిమా కాలేదు. కొన్ని ఐడియాలు విన్నప్పుడు ‘అసలు ఇది సినిమాకు పనికి రాదు’ అనిపిస్తుంది. కానీ.. అలాంటి వాటితోనే మ్యాజిక్ చేస్తుంటారు. రెండు చోట్లా మ్యాజిక్ చేసేది ఐడియా కాదు… దాన్ని చూపించిన విధానం. సినిమా భాషలో చెప్పాలంటే స్క్రీన్ ప్లే. ఓ సాధారణమైన కథని ప్రేక్షకుడ్ని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయాలన్నా, ఓ మంచి ఐడియాని నాశనం చేయాలన్నా – అది స్క్రీన్ ప్లే చేతుల్లోనే ఉంది. ‘గాయపడ్డ సింహం’ ఐడియాగా చూస్తే – ‘క్రేజీ’ గానే అనిపించింది. మరి.. ఆ ఐడియాని రెండు గంటల పాటు నడిపించే శక్తి దర్శకుడు రాసుకొన్న స్క్రీన్ ప్లేకు ఉందా, లేదా? గాయం సింహానికా, ప్రేక్షకులకా?
దరహాస్ (తరుణ్ భాస్కర్) అమెరికా వెళ్లాలనుకొంటాడు. అమెరికా వెళ్తేనే తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లవుతుంది. నాన్న చేసిన అప్పులు చెల్లవుతాయి. అందుకే అమెరికా వీసా సంపాదిస్తాడు. స్నేహితుల దగ్గర, ఇంట్లో వాళ్ల ముందు గొప్పాలు పోయి… అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తాడు. కానీ.. ట్రంప్ విధానాల వల్ల, కొన్ని గంటల్లోనే ఇండియా తిరిగి వచ్చేస్తాడు. దాంతో పరువు మొత్తం పోతుంది. ప్రేమించి పిల్ల చేయిదాటి పోతుంది. దాంతో ట్రంప్ పై పగ పెంచుకొంటాడు. ఎలాగైనా ట్రంప్ ని దెబ్బ తీయాలనుకొంటాడు. అందుకే ట్రంప్ పై చేతబడి ప్రయోగం చేయాలనుకొంటాడు. మరి ఆ ప్రయోగం విజయవంతమయ్యిందా? ఈ కథలో ధర్మ (జేడీ చక్రవర్తి) ప్రమేయం ఎంత? చేతబడిలో ప్రయోగంలో శ్రీవిష్ణు వాటా ఎంత? అనే విషయాలు తెరపై చూడాలి.
అమెరికా అధ్యక్షుడిపై చేతబడి ప్రయోగం చేస్తే….? అనే ఐడియానే క్రేజీగా అనిపిస్తుంది. ఆ పాయింట్ చుట్టూ కొన్ని పాత్రలు సృష్టించుకొని, కొంత వినోదం పండించే ప్రయత్నం చేసిన సినిమా ఇది. ఇలాంటి వినోదాత్మక సినిమాలు చూస్తున్నప్పుడు లాజిక్కులు పట్టించుకోకూడదు. అప్పుడే మ్యాజిక్ చూడగలం. `అమెరికా అధ్యక్షుడిపై చేతబడి ప్రయోగం ఏమిటి.. సిల్లీగా` అనుకొంటే అక్కడే ఈ సినిమా ఆఫ్ అయిపోతుంది. దాన్ని కామెడీగా భావిస్తేనే సీన్లు ఎంజాయ్ చేయగలం. చేతబడి అనే కాన్సెప్ట్ కథలోకి వచ్చేంత వరకూ `గాయపడ్డ సింహం` ప్రయాణం.. సాదా సీదాగానే ఉంటుంది. ఎప్పుడైతే చేతబడి అనే అంశం ఎంటర్ అయ్యిందో అక్కడ్నుంచి తమాషా మొదలవుతుంది. జేడీ, శ్రీవిష్ణు పాత్రల రాక కథని కాస్త రసదాయకంలో పడేస్తాయి. విరగబడి నవ్వుకొనే సీన్లు ఉండవు కానీ, పెదాలపై చిన్న చిరునవ్వు మాత్రం ఎక్కడికీ పోదు. కొరియర్ మారిపోవడం, అందులోంచి పుట్టుకొచ్చే ఫన్.. వీటి మధ్య ఫస్టాఫ్ గడిచిపోతుంది. కేజీఎఫ్ స్టైల్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొంటూ పోవడం, కొన్ని హిట్ సినిమాల్లోని సన్నివేశాల్ని స్నూఫ్ చేయడం సరదాగా అనిపిస్తుంది. బొమ్మరిల్లు సీన్ అంతగా వర్కవుట్ అవ్వలేదు కానీ, పోకిరి సీన్ మాత్రం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది.
ట్రంప్ వచ్చాక, భారతీయుల అమెరికా కష్టాలు రెట్టింపు అయ్యాయి. అమెరికా నుంచి తిరుగుముఖం పట్టిన యువత ఆయా సన్నివేశాలతో రిలేట్ అవుతారు. ట్రంప్‌ని కూడా ఈ సినిమాలో బాగా వాడేశారు. `తొలి పరిచయం – ట్రంప్` అనే టైటిల్ కార్డు వేయడంలోనే దర్శకుడి తాలుకూ సెటైర్ అర్థం అవుతుంది. కాకపోతే ఇలాంటి సున్నితమైన విషయాలు చర్చించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చిత్రబృందం తీసుకొంది. అందుకే ఎలాంటి కాంట్రవర్సీలకూ అవకాశం దొరకలేదు.
జేడీ చక్రవర్తి పాత్రని స్టైలీష్ గా డిజైన్ చేశారు. సత్య నాటి రోజులు గుర్తొస్తాయి. అయితే సెకండాఫ్ లోని ఈ పాత్రలో ఛేంజ్ ఓవర్ కనిపిస్తుంది. దాని వల్ల ధర్మ పాత్రలో కొంత ఫ్రెష్ నెస్ వచ్చింది. శ్రీవిష్ణు చేసిన పాత్రని ఎవరితోనైనా చేయించి ఉండొచ్చు. కానీ శ్రీవిష్ణు రాకతో కొత్త బలం వచ్చినట్టైంది. కొన్ని చోట్ల తన కామెడీ టైమింగ్ తో కొంత మేనేజ్ చేశాడు. కానీ శ్రీవిష్ణు లాంటి నటుడు దొరికినప్పుడు, అందులోనూ ఇలాంటి క్యామియో చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ పాత్రని మరింత బలంగా వాడుకొని ఉండాల్సింది. క్లైమాక్స్ లో `పోరాట సింహం` అంటూ సీక్వెల్ కి టైటిల్ కార్డ్ వేశారు. జేడీ, శ్రీవిష్ణు క్యారెక్టర్లను ఇంకాస్త పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేశారు.
తరుణ్ భాస్కర్ ఎప్పటిలా చలాకీగా చేసుకొంటూ వెళ్లిపోయాడు. తొలిసారి తాను డాన్స్ కూడా చేశాడు. ఫరియాది గెస్ట్ రోల్ లాంటిది. తనతో పోలిస్తే మానసా చౌదరి పాత్రకు ఉన్న నిడివి ఇంకా తక్కువ. శ్రీవిష్ణు ఉన్నంత సేపూ ఓ జోష్ అయితే ఉంటుంది. ఓ వైపు హీరోగా చేస్తూ, ఇలాంటి కామియో ఒప్పుకొన్నాడంటే గ్రేటే. రీ ఎంట్రీలో జేడీకి మంచి పాత్ర పడింది. ఇలాంటి పాత్రలకు ఇక ముందు కూడా జేడీ పేరు తప్పకుండా పరిశీలించాల్సిందే. శుభలేఖ సుధాకర్, హర్షవర్థన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కశ్యప్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.
చిన్న సినిమానే అయినా, క్వాలిటీ తో తీశారు. సౌండ్ డిజైనింగ్ బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా కుదిరింది. రైటింగ్ పరంగా ఇంకాస్త బలంగా ఉండాల్సింది. స్నూఫ్లపై ఆధారపడకుండా ఒరిజినల్ కామెడీ పండించే ప్రయత్నం చేయాల్సింది. కాకపోతే.. ఆయా హీరోల ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు కాబట్టి, ఓకే. ఈరోజుల్లో థియేటర్లకు టైమ్ పాస్ కి వెళ్లే వాళ్లే ఎక్కువ. అది దక్కితే చాలు అనుకొంటే ఈ సింహాన్ని నిరభ్యంతరంగా చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని నవ్వులకైతే గ్యారెంటీ.
తెలుగు360 రేటింగ్: 2.5/5
