జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ అత్యధిక వృద్ధిని నమోదు చేస్తోంది. ఏప్రిల్ నెలలో వెలువడిన జీఎస్టీ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా వసూళ్లు 2.43 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరగా, అందులో తెలంగాణ రాష్ట్రం 36 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది జాతీయ సగటు వృద్ధి 8.7 శాతం కంటే చాలా ఎక్కువ.
గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 2026 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.21 లక్షలకు చేరింది. అంటే సుమారు 70 వేలకు పైగా కొత్త వ్యాపారాలు పన్ను పరిధిలోకి రావడం వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణమైంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరం ఉండటం వల్ల వినియోగం ఆధారిత పన్ను వసూళ్లు పెరిగాయి. ఏప్రిల్ నెలలో వసూలైన జీఎస్టీలో దిగుమతుల వాటా ఎక్కువగా ఉంది. తెలంగాణకు వచ్చే వస్తువుల దిగుమతిపై ఐజీఎస్టీ సెటిల్మెంట్ రాష్ట్ర ఖజానాకు కలిసొచ్చింది.
హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలు నిలకడగా రాణిస్తున్నాయి. మార్చి నెలలో జరిగిన ఆర్థిక కార్యకలాపాలన్నీ ఏప్రిల్ వసూళ్లలో ప్రతిబింబిస్తాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సాఫ్ట్వేర్ సేవల ఎగుమతులకు సంబంధించి జరిగిన ఇన్పుట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్లు కూడా వృద్ధికి దోహదపడ్డాయి. తెలంగాణ పన్నుల విభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా అనలిటిక్స్‌ను ఉపయోగించి పన్ను ఎగవేతదారులను గుర్తించడం, ఇన్వాయిస్ మిస్-మ్యాచింగ్‌ను అరికట్టడం వంటి చర్యలు చేపట్టింది. దీనివల్ల పారదర్శకత పెరిగి, ఎగవేతలు తగ్గి ఆదాయం పెరిగింది. తెలంగాణలో వ్యాపారాల విస్తరణ, పెరిగిన వినియోగం, సమర్థవంతమైన పన్ను వసూళ్ల వ్యవస్థ వల్ల తెలంగాణ ఈ 36 శాతం వృద్ధిని సాధించగలిగింది.
