పంజాబ్ సీఎం మాన్ అంటే మొదటగా అందరూ గుర్తు చేసుకునేది ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ గురించే. సీఎం అయన తర్వాత తాగనని చాలా సార్లు చెప్పారు కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా ఆయన తాగేసి వచ్చారని విపక్షాలు గోల పెడుతూంటాయి. తన ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం జరగడంతో ఆయన విశ్వాస పరీక్ష పెట్టుకున్నారు. అందు కోసం అసెంబ్లీకి వచ్చారు. ఆయితే ఆయన ఊగుతూ.. అసందర్భమైన మాటలు మాట్లాడటంతో తాగేసి వచ్చారని అందరికీ అర్థమైంది.
సభలో సీఎం ప్రసంగిస్తుంటే.. అందులో అర్థం కంటే ఆల్కహాల్ వాసనే ఎక్కువ వస్తోందని విపక్ష సభ్యులు గొల్లుమన్నారు. ఆయన మాటలు అసందర్భంగా ఉండటం, ఏదో మత్తులో ఊగుతూ మాట్లాడటం చూశాక.. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా మీరు మెజారిటీ నిరూపించుకునే ముందు.. మీ రక్తంలో ఆల్కహాల్ పర్సెంటేజీని నిరూపించుకోండి అంటూ బ్రీత్ ఎనలైజర్, డోప్ టెస్టుల డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. సాధారణంగా ఎమ్మెల్యేల మద్దతు కోసం ఫ్లోర్ టెస్ట్ చేస్తారు కానీ, పంజాబ్‌లో మాత్రం సీఎం కిక్కు దించడానికి టెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపించారు.
సీఎం నిజంగానే గంగాజలం లాంటి వారు అయితే.. అక్కడికక్కడే ఊది తన క్లీన్ ఇమేజ్ను నిరూపించుకోవచ్చు. కానీ, భగవంత్ మాన్ మాత్రం ఇది నన్ను అవమానించడమే అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. పరీక్షలు చేయించుకుంటే ఫలితం ఎక్కడ పాజిటివ్ వస్తుందో అన్నట్లుగా.. స్పీకర్ ద్వారా సభను వాయిదా వేయించేసి చల్లగా జారుకున్నారు.
సీఎం కాకముందు నుంచి భగవంత్ మాన్కు ఉన్న ఈ సరదా గురించి అందరికీ తెలిసిందే. చాలా సార్లు ఇకపై చుక్క ముట్టను అని శపథాలు చేసినా.. అవి నీటి మీద రాతలు కాదని, గ్లాసులో రాతలే అని ఆయన తాజా ప్రవర్తనతో మరోసారి రుజువైందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ కంటే.. మాన్ ఫ్లేవర్ టెస్ట్ గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు!
