నారా లోకేష్‌ను పొగిడేందుకు చాలా మంది ఉంటారు. ఆయన ఏం చేసినా పొగుడుతారు. కానీ కొంత మంది మాత్రం ఆయన చేసిన పనుల్ని చూసి పొగుడుతారు. నిజానికి లోకేష్‌ను పొగడాలంటే న్యూట్రల్స్‌కు అంత త్వరగా మనసు రాదు. ఎందుకంటే తమపై ఎక్కడ టీడీపీ ముద్ర వేస్తారోనని భయం. కానీ ఈ రోజు మాత్రం ఆయనను పార్టీలకు అతీతం న్యూట్రల్స్ అంతా అభినందిస్తున్నారు. దానికి కారణం పేపర్లో ఇచ్చిన ప్రకటన.
ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో సహా పత్రికల మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చింది విద్యాశాఖ. ఇప్పటి వరకూ కార్పొరేట్ సంస్కృతిలోనే ఇలాంటి ప్రకటనలు చూశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఎంత ప్రతిభ చూపినా పత్రికా ప్రతినిధులు గుర్తించి మండల స్థాయిలో ఏవైనా వార్త రాస్తే అదే గొప్ప. కానీ ఈ సారి మాత్రం వారి ప్రతిభను రాష్ట్రం మొత్తం తెలియచెప్పేలా.. ప్రకటనలు ఇచ్చారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. అందుకే ఈ చొరవ తీసుకున్న విద్యాశాఖ.. ఆ శాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్ ను పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రశంసిస్తున్నారు.
నిజానికి నారా లోకేష్ టార్గెట్ తనకు ప్రశంసలు రావడం కాదు. తనకు పబ్లిసిటీ అవసరం లేదు. అలా ప్రకటనలు ఇచ్చే లక్ష్యం ఒక్కటే. ప్రభుత్వ విద్య అత్యున్నత ప్రమాణాలకు చేరుకుంటోందని నిరూపించడం. గతి లేక ప్రభుత్వ స్కూళ్లలో చేరే పరిస్థితిని మార్చి.. మంచి విద్య కోసం ప్రభుత్వ స్కూళ్లనే ఎంచుకునేలా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి. కానీ లోకేష్ సంతృప్తి పడేది మాత్రం .. కార్పొరేట్ స్కూళ్ల కన్నా ప్రభుత్వ స్కూళ్లే మిన్న అని.. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే.


