ఏడాది యాత్ర – 2 : కక్ష సాధింపుల పాలన..!

” మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడ్నీ వదలం.. మీ సంగతి తేలుస్తా..” ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర్నుంచి వైసీపీ నేతల వరకూ.. అందరి నోటా ఈ డైలాగ్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా.. ఓ కలెక్టర్‌పై.. మరో పోలీస్ కమిషనర్‌పై.. ఇలా హెచ్చరికలు జారీ చేశారు. ఇక చిన్న.. కింది స్థాయి నేతల సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి.. ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలు… అధికారులపై విరుచుకుపడటం కామనే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి చూస్తామని ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసి.. వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ వారైనా అధికారులపై కానీ.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కానీ.. టార్గెట్ చేసి మరీ కక్ష సాధించే ప్రయత్నాలనే ఎజెండాగా పెట్టుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టుకుంది.

అధికారుల్ని విభజించి కక్ష సాధించిన ఏకైక సర్కార్..!

అధికారం చేపట్టిన దగ్గర్నుంచి… వైసీపీ సర్కార్ పెద్దలకు.. గత ఐదేళ్ల కాలంలో… చంద్రబాబు హయాంలో చురుగ్గా పాల్గొన్న అధికారులపై దృష్టి పెట్టింది. చాలా మందికి ఇప్పటికీ పోస్టింగుల్లేవంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కొంత మందికి తప్పనిసరిగా పోస్టింగులు ఇవ్వాల్సి వచ్చినా.. వారు ఎదుర్కొన్న వేధింపులు అన్నీ ఇన్నీ కాదు. గత ప్రభుత్వంలో కీలక పదవులు పొందడమే వారు చేసిన తప్పు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొంత మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారు కూడా గత ప్రభుత్వంలో పని చేశారు. కానీ వారెవరికీ.. అప్పట్లో అలాంటి వేధింపులు ఎదురు కాలేదు. అప్పటి వరకూ డీజీపీగా పని చేసిన వ్యక్తిని అవమానకరంగా పంపేయడం దగ్గర్నుంచి ఏపీఈడీబీగా పని చేసిన జాస్తి కృష్ణకిషోర్ వరకూ.. ఎంతో మంది ప్రభుత్వాల కక్ష సాధింపు అజెండాలో నలిగిపోయారు. ఉన్నత స్థాయి అధికారులే కాదు.. కింది స్థాయి వారికీ ఈ పరిస్థితి తప్పలేదు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారంటూ… అప్పుడు స్టేషన్లో విధులు నిర్వహించిన వారికీ పోస్టింగులు ఇవ్వలేనంత కక్ష పాలకుల మనసుల్లో నిండిపోయింది. కులం, మతం, వర్గం కక్షతో.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగలకు పోస్టింగులు.. జీతాల్లేవనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. అధికారులు.. ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తారు. తర్వాత వచ్చే ప్రభుత్వం వారిని వేధించాలని రూల్ పెట్టుకుంటే.. ఇప్పుడు పవర్ అనుభవిస్తున్న ఉన్నతాధికారులు రిటైరైనప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు. ఉన్నతాధికారులైనా.. ఉద్యోగులకైనా సొంత అభిప్రాయాలు ఉండవు. ప్రభుత్వం చెప్పినట్లు చేయాల్సిందే. వారితో ఎంత చట్ట విరుద్ధంగా పనులు చేయించుకోవచ్చో.. ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్లందర్నీ టార్గెట్ చేయరని నమ్మకం ఏముంది…?

ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆత్మహత్యలే దిక్కు..!

ఉద్యోగులపై కక్ష సాధించడంలో అసాధారణ భావజాలం చూపినా సర్కార్.. ఏడాది కాలంలో రాజకీయ నేతల్ని వదిలి పెట్టలేదు. స్పీకర్‌గా పని చేసిన కోడెల శివప్రసాదరావు … తన పరువు పోయిందని.. ఆత్మహత్య చేసుకున్నారంటే.. ప్రభుత్వం ఎంత దారుణంగా.. కక్ష సాధింపులకు పాల్పడిందో.. అర్థం చేసుకోవడం సులభమే. కోడెల స్పీకర్‌గా… పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదన్న కారణం చూపి.. ప్రభుత్వం ఆయనను వేధించింది. లెక్క లేనన్ని కేసులు పెట్టించింది. ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా వదిలి పెట్టలేదు. ఇప్పుడు.. వైసీపీకి చెందిన స్పీకర్ కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదు. తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా… ఆ స్థాయిలో వేధింపులకు గురి చేస్తే… ఈ కక్ష సాధింపుల పర్వం ఎక్కడితో ఆగుతుంది..?. ఒక్క కోడెల మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీ నేతలు.. గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉన్నాయో.. లేవో తెలియని కేసుల పేరుతో జైలుకెళ్లారు. చింతమనేని ప్రభాకర్ ను.. ఒక కేసు రిమాండ్ ముగిసే సమయంలో.. మరో కేసు చూపించి.. నెలల తరబడి జైల్లో పెట్టారు. ఓ స్థాయి ఉన్న నేతలకే ఇలా ఉంటే.. కింది స్థాయి కార్యకర్తల గురించి చెప్పాల్సిన పని లేదు. కొన్ని వందల గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు మాత్రమే ఉంటున్నారు. ఇతర పార్టీల మద్దతుదారులు నివసించలేని పరిస్థితి.

ఏడాదంతా కక్ష సాధింపు అజెండానే అమలు..!

అధికారం అందింది కాబట్టి… ప్రతిపక్ష పార్టీ నేతలపై ఎలాగైనా కేసులు పెట్టాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం ఏడాది పాటు పని చేస్తూనే ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడానికి చాలా సమయం కేటాయించింది. అనేక మంత్రివర్గ ఉపసంఘాలు.. విచారణ కమిటీలు వేసింది. పీటర్లు.. పీటర్సన్‌లు… పత్రాలు వడబోశారు. ఆ విచారణల పేరుతో.. మీడియా లీకులు ఇచ్చి.. అలా జరిగిందా.. అని ప్రచారం చేయగలిగారు కానీ… ఇంత వరకూ గత ప్రభుత్వంలో జరిగిన ఒక్క అవినీతి కేసునూ బయటపెట్టలేకపోయారు. అమరావతి భూముల స్కాం దగ్గర్నుంచి అన్న క్యాంటీన్ల వరకూ అన్నింటిలోనూ… అవినీతేనని బయట పెడతామని చెప్పారు కానీ.. చెప్పలేకపోయారు. కానీ ఆ విచారణల పేరుతో. సీఐడీని టీడీపీ నేతల ఇళ్లపైకి పంపి.. వారిలో భయాందోళనలు కల్పించే వ్యూహంలో మాత్రం విజయం సాధించారు. కక్ష సాధింపుల పాలనలో ఇదో పరాకాష్ట లాంటి వ్యవహారం.

ఎవరు వ్యతిరేకించినా ప్రతీకారం తీర్చుకోవడమే ఏకైక ఎజెండా..!

పాలకుల మైండ్ సెట్… అక్కడే ఉంది. ఏడాది కాలంలో… తమ కసి ఎంత తీర్చుకున్నామన్నదానిపైనే రోజువారీ కార్యకలాపాలు నడిచాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై తెలుగుదేశం పార్టీ ముద్ర వేయడం దగ్గర్నుంచి… వారిని నానా రకాలుగా.. వేధించడం వరకూ అన్నీ జరిగాయి. కియా అనంతపురం నుంచి వెళ్లిపోతోందని రాయిటర్స్ రాస్తే.. దాన్ని చంద్రబాబుకు అంటగట్టేస్తారు.. పీపీఈలు లేవని డాక్టర్ సుధాకర్ అంటే చంద్రబాబు చెప్పించాడని అంటారు. అలా అంటారు కానీ.. విమర్శించిన వారికి మాత్రం.. చుక్కలు చూపిస్తారు. ఈ రోజు డాక్టర్ సుధాకర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో.. ఆయనను ఎంతగా వేధించారో… చూస్తే.. ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు ధోరణి ఉండాలా..? అని జనం ఆశ్చర్యపోక తప్పదు.

పాలకుల ఆలోచనా విధానం అక్కడే ఉంటే ఎవరేం చేయగలరు..?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలానే ఉండాలి. అధికారపక్షంలోకి వచ్చినప్పుడు అధికారపక్షంలానే ఉండాలి. అధికారం అందిన తర్వాత ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే… కక్ష సాధింపులతో రెచ్చిపోతే.. అది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజలు అధికారం ఇచ్చింది.. తమకు మంచి చేస్తారనే.. వ్యక్తిగత కక్షలు.. రాజకీయ కార్పణ్యాలు తీర్చుకోమని కాదు. కానీ దురదృష్టవశాత్తూ.. ప్రస్తుత ప్రభుత్వం… అలా అనుకోవడం లేదు. అధికారం దొరికింది.. ఇష్టం లేని వాళ్లపై దండెత్తడానికే అనుకుంటోంది. ఏడాది నుంచి ఇదే… పాలకుల మైండ్ సెట్ చూస్తే ఇంకో నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత అధికారం కోల్పోతే..!?

Read Also : ఏడాది యాత్ర 1 : బలంగా సంక్షేమ సంతకం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close