యూపీలో బీజేపీ గెలిస్తే ఏపీలో సంబరాలు చేసుకుంటారు ఆ పార్టీ నేతలు. వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి..ఇంకేముంది మేము ఏపీలో అధికారం చేపట్టబోతున్నామని ప్రకటించేస్తారు. కానీ యూపీలో కానీ.. ఇతర రాష్ట్రాల్లో కానీ బీజేపీ గెలవడానికి ఎంత కష్టపడిందో మాత్రం ఆలోచించరు. ఉత్తరాది రాష్ట్రాల దాకా ఎందుకు పొరుగున ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు అధికార పార్టీపై ఎలా పోరాడుతున్నారో చూసినా… తాము కడుపులో చల్ల కదలకుండా ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నామని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఏపీలో బీజేపీ ఎలా బలపడుతుందో చెప్పగలరా ?
అన్ని పార్టీల నేతలో పోలోమంటూ బీజేపీలో చేరి తమ పార్టీని బలోపేతం చేస్తారని జీవీఎల్ చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు ఎన్నికలకు ముందు గతంలో బీజేపీలో చేరిన చాలా మంది నేతలు పక్క చూపులు చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నా… టీడీపీలో ఉన్నట్లే. ఆయన తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన సోదరుడు కుమారుడ్ని టీడీపీలో చేర్పించేశారు. ఆయనకే టీడీపీ తరపున టిక్కెట్ కూడా ఖరారు చేసుకున్నారు. బీజేపీలో ఉన్నా ఆదినారాయణరెడ్డి తన రాజకీయ వారసుడికోసమే పని చేస్తారు.
ఇక ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మరో నేత వరదాపురం సూరి చంద్రబాబు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు టీడీపీలో చేరాలనుకుంటున్నారు. ఇతర నేతల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కరంటే ఒక్క నేత గట్టిగా బీజేపీ కోసం పని చేసేవారు లేరు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. తన కుమారుడ్ని ఇంకా టీడీపీలోనే ఉంచారు. కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి రెడీ చేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. బీజేపీలో ఉన్న నేతలంతా ఆ పార్టీపై నమ్మకం పెట్టుకోలేదు. కానీ జీవీఎల్ మాత్రం ముందూ వెనుకా చూసుకోకుండా పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నారు. ఇది ఆ పార్టీని ప్రజల్లో మరింత నవ్వుల పాలు చేస్తోంది.