హరీష్ రావు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. రోజూ రేవంత్ రెడ్డి అనే మాటలు ఆయనను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. గట్టిగా స్పందిస్తున్నారు. ఆదివారం కూడా ఖమ్మంలో రేవంత్ చేసిన ప్రసంగం ఆయనకు పట్టరాని కోపం తెప్పించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చాలని ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునివ్వడం అరాచకత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన హోం మంత్రి హోదాలో ఉండి, హింసను ప్రేరేపించడం నేరాన్ని ప్రోత్సహించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం దిగజారడం తెలంగాణ సంస్కృతి కాదన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలపై చేయి వేస్తే రేవంత్ రెడ్డికి దిమ్మతిరిగేలా సమాధానం చెబుతామని, ప్రజాక్షేత్రంలో ప్రజలే కాంగ్రెస్కు గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమంతా ద్రోహాల పుట్ట అని, ఆయన డీఎన్ఏలోనే వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయని మండిపడ్డారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్దని, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆయనొక ప్రజాస్వామ్య ద్రోహి అని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ, టీడీపీ కూటమితో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని, పగలు రాహుల్ గాంధీ జపం చేస్తూ రాత్రి వేళ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నా రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రెడ్డి సొంత రాజ్యాంగం నడుస్తోందా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి పొరుగు రాష్ట్రాలకు మేలు చేసేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని, ఇలాంటి విద్వేష పూరిత రాజకీయాలను తెలంగాణ సమాజం సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
