Hey Balwanth Movie Review
తెలుగు360 రేటింగ్:2.25/5
కంటెంట్ బావుంటే చిన్న సినిమాలకూ ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారు. ఈ మధ్య కాలంలో ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ విజయాలే దానికి నిదర్శనం. ఈ రెండు సినిమాల వెనుక ఉన్న వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఇప్పుడు మరోసారి సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘హే బల్వంత్’. సుహాస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. పాయింట్ ఏమిటో చెప్పకుండా బిజినెస్.. బిజినెస్.. అంటూ క్యూరియాసిటీ పెంచాయి. ఇంతకీ ఆ బిజినెస్ ఏమిటి? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది?
కృష్ణ (సుహాస్) చిన్నప్పటినుంచే తండ్రి బల్వంత్ (నరేష్) చేస్తున్న బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే ఆ బిజినెస్ ఏమిటో కృష్ణకి పూర్తిగా తెలియదు. తన దగ్గరే ఉంటే ఆ బిజినెస్ గురించి తెలిసిపోతుందేమో అనే భయంతో కృష్ణను హైదరాబాద్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాడు బలవంత్. అక్కడే ఎంబీఏ పూర్తి చేసిన కృష్ణ, తండ్రి బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవాలని ఇంటికి వస్తాడు. అప్పటికీ తండ్రి బిజినెస్ ఏమిటో కృష్ణకి తెలియదు. ఇదే సమయంలో ఎన్జీవో నడుపుతున్న మిత్ర (శివానీ నాగారం)తో కృష్ణకి ప్రేమ మొదలవుతుంది. ఇంతలో బలవంత్ కు అనారోగ్యం చేస్తుంది. దీంతో బిజినెస్ బాధ్యత తానే తీసుకోవాలని ఫిక్స్ అయిన కృష్ణ తండ్రి ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ జరుగుతున్న బిజినెస్ చూసి షాక్ అవుతాడు. అంతలా షాక్ అయ్యే ఆ బిజినెస్ ఏమిటి? తండ్రి బిజినెస్ గురించి తెలుసుకున్న కృష్ణ ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ బిజినెస్ కారణంగా కృష్ణ ప్రేమకి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? ఈ బిజినెస్ తండ్రి-కొడుకుల మధ్య ఎలాంటి దూరాన్ని పెంచింది? వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేది మిగతా కథ.
“బిజినెస్ కొత్తదేమీ కాదు పాతదే, కానీ కొత్త కొత్త ఐడియాస్ ఇన్వాల్ చేస్తున్నారు” ఈ సినిమాలో సుదర్శన్ చెప్పిన డైలాగ్ ఇది. సినిమా కథ కూడా ఇంతే. ఎలాంటి కథ చెప్పినా చివరికి వినోదమే పండించాలి. అది పండాలంటే ఐడియాలు కొత్తగా ఉండాలి. దర్శకుడు గోపి అచ్చర ఇందులో కదిపిన ఎమోషన్ పాతదే అయినా దానిని వీలైనంత కొత్త సెటప్‌లో సెట్ చేశాడు.
ప్రచార చిత్రాలలో బిజినెస్ ఏమిటి రివీల్ చేయలేదు కానీ ఈ సినిమా ఆరంభంలోనే నరేష్ చేసే బిజినెస్‌ను ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే హీరో పాత్రకు బిజినెస్ విషయంలో క్లూ ఉండదు. ఆడియన్స్‌కు తెలిసి క్యారెక్టర్స్‌కు తెలియని స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సన్నివేశాలు నడిపారు. అందులో కొన్ని వర్క్ అవుట్ అయ్యాయి. చైల్డ్‌హుడ్ ఎపిసోడ్, ఆ తర్వాత మిత్ర-కృష్ణ లవ్, కృష్ణకి బిజినెస్ గురించి తెలియడం… ఇక్కడి వరకూ ఫన్ మామూలుగానే ఉంటుంది. సుహాస్, సుదర్శన్, వెన్నెల కిశోర్ చేసిన ప్రకృతి వైద్యం ఎపిసోడ్ మాత్రం హిలేరియస్‌గా వచ్చింది. అలాంటి ఎపిసోడ్స్ మరో రెండు పడితే సినిమా గ్రాఫ్ ఇంకా లేచేది. అజయ్ ఘోష్, హర్ష వర్ధన్ పాత్రలను ముడిపెట్టిన తీరు ఇంటర్వెల్ ట్విస్ట్‌కు బాగా ఉపయోగపడింది. హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్‌లో ‘ఆర్థోడాక్స్ ఫ్యామిలీ’ డైలాగ్‌ను వాడుకున్న తీరు ఇంటర్వెల్‌కు మంచి పే ఆఫ్ ఇచ్చింది.
సెకండ్ హాఫ్ కథ టోన్ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోతుంది. అప్పటివరకు ‘బిజినెస్’ అంటూ సాగిన కథ ‘కిడ్నాప్’ డ్రామాగా మారిపోతుంది. వెన్నెల కిశోర్, స్రవంతి పాత్రల మధ్య ప్రేమ-పెళ్లి అంటూ అజయ్ ఘోష్ ఇంట్లో డ్రామా నడిపారు. సుదర్శన్ చెప్పినట్లు అదంతా బొమ్మరిల్లు భోజ్‌పురి వెర్షన్. డెడ్ బాడీ కోసం రెండు గ్యాంగ్స్ వేటలో కొంత స్పష్టత లోపించింది. ‘శెట్టి’ అనే పేర్ల చుట్టూ నడిపిన సీక్వెన్స్‌లో కొన్ని నవ్వులు పండాయి. డెడ్ బాడీ డ్రామా క్లోజ్ అయిన తర్వాత చివరి ఇరవై నిమిషాలను హెవీ ఎమోషనల్ డ్రామాగా మార్చారు. గట్టి సందేశాలు కూడా ఇవ్వాలని చూశారు. కాకపోతే అంత హెవీ సెంటిమెంట్, సందేశం వినడానికి ఆడియన్స్ ప్రిపేర్‌గా ఉండరు. ఆ ఎమోషన్ కూడా బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. చివర్లో అంత బలమైన తండ్రి-కొడుకుల డ్రామా ఉన్నప్పుడు ఆడియన్స్‌ను బిగినింగ్ నుంచే ప్రిపేర్ చేసి ఉంటే ఆ ఎమోషన్ సహజంగా హత్తుకునేది.
సుహాస్ ఎప్పటిలానే తనకు సరిపడే క్యారెక్టర్ చేశాడు. బిజినెస్ మ్యాన్‌గా ఎదిగిపోవాలనే ఆత్రుత ఉన్న పాత్రలో తన నటన ఆకట్టుకుంటుంది. తన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. చివర్లో ఎమోషన్ సీన్స్‌లో బాగా చేశాడు. శివానీ అందంగా, చలాకీగా కనిపించింది. ‘ఆర్థోడాక్స్ ఫ్యామిలీ’ అంటూ తను చేసిన హంగామా నవ్విస్తుంది. నరేష్‌కు రెండు భారీ ఎలివేషన్స్ పడ్డాయి. పోకిరి, బాలయ్య షోరీల్ రెండూ నవ్విస్తాయి. కాకపోతే ఆ పాత్రను కథలో ఇంకా ఆర్గానిక్‌గా వాడాల్సింది. క్యారెక్టర్ ఫ్లో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సుదర్శన్ చాలా చోట్ల నవ్విస్తాడు. వెన్నెల కిశోర్, స్రవంతికి సెపరేట్‌గా ఒక లవ్ ట్రాక్ ఉంది. సెకండ్ హాఫ్‌కు అదే లీడ్ అయ్యింది. వెన్నెల కిశోర్ క్యారెక్టర్ ఆర్క్ను ఇంకా హిలేరియస్‌గా రాసే అవకాశం ఉంది. స్రవంతి డైలాగ్ స్పష్టంగా చెబుతోంది కానీ ఎక్స్ప్రెషన్ ఇంకా మెరుగవ్వాలి. హర్ష వర్ధన్, అజయ్ ఘోష్ పాత్రల్లో ఫన్ ఉంది. బాబు మోహన్‌కు మంచి ట్విస్ట్ ఉన్న క్యారెక్టర్ పడింది.
పాటల్లో వివేక్ సాగర్ మార్క్ వినిపించలేదు కానీ బీజీఎం చాలా చోట్ల ఎంగేజింగ్‌గా ఉంది. కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. ఈ కథ నేపథ్యమే అలాంటిది. దర్శకుడు గోపి నవ్విస్తూనే ఎమోషనల్‌గా హత్తుకునే ఓ కథ చెప్పాలని అనుకున్నాడు. నవ్వించడంలో అది అంతంత మాత్రమే వర్క్ అవుట్ అయ్యింది.
తెలుగు360 రేటింగ్:2.25/5
