సాధారణంగా ఈఎంఐ లక్ష అంటే కళ్లు తిరిగిపోతాయి. కానీ ఇప్పుడు మారిపోతున్న జీవనశైలి కారణంగా లక్ష రూపాయలు అద్దె కట్టి ఉంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. లక్ష అద్దెతో పాటు ఇంకా అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో ఇతర సౌకర్యాల కోసం మరికొన్ని వేలు చెల్లిస్తారు. ఈ లక్ష రెంట్ అనేది ప్రాథమికమే. లగ్జరీని బట్టి మరికొంత పెరుగుతుంది కూడా.
హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆకాశ హర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. వీటిలో 70శాతం ఎన్నారైలే కొనుగోలు చేస్తున్నారు. అద్దె ఆదాయంతో పాటు ఆస్తి భద్రంగా ఉంటుందన్నది కారణంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అంటే ఇలా నిర్మాణం అవుతున్న అపార్టుమెంట్లలో సగానికిపైగారెంట్ కు ఇచ్చేస్తున్నారు. మూడు నాలుగు కోట్లు పెట్టి కొని.. కొన్ని వేలకు అద్దెకు ఇవ్వలేరు. అలాగే సొంత ఇల్లు కొనాల్సిన అవసరం లేదని లగ్జరీ ఇళ్లలో రెంట్ కు ఉంటే సరిపోతుందని అనుకునేవారికి ఈ ఇళ్ల అందుబాటు పెరుగుతోంది.
ఐటీ కారిడార్ చుట్టూ లగ్జరీ ఫ్లాట్లు, స్కై విల్లాస్ లలో అద్దెలు సాధారణంగా 3 BHK లేదా 4 BHK ఫ్లాట్లకు నెలకు 1 లక్ష నుండి 3 లక్షల వరకు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఉంటోంది. మెయిన్టనెన్స్ కనీసం ఐదు నుంచి పదివేల వరకూ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు అపార్టుమెంట్ కాంప్లెక్స్ నిర్వహణ చూసేవారే ఎక్కువగా అద్దెకు ఇవ్వడం.. వాటి మెయిన్టనెన్స్ వంటివి చేస్తున్నారు.
లగ్జరీ జీవితాలు గడిపేవారి ప్రపంచం వేరుగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఈ ఆపార్టుమెంట్లు ఉంటాయి.