దేశంలో ప్రముఖ అల్యూమినియం తయారీ ఇండస్ట్రీ హిందాల్కో కుప్పంలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ ప్లాంట్ ద్వారా అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాదు, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ బాడీలను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఐ ఫోన్లు ఇండియా నుంచి భారీగా ఎగుమతి అవుతున్నాయి. బెంగళూరు సమీపంలో ప్లాంట్ కూడా ప్రారంభమయింది. కుప్పం కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉంటుంది. అందుకే అక్కడ ప్లాంట్ పెట్టాలని హిందాల్కో నిర్ణయించుకుంది.
ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం తయారీ సంస్థల్లో ఒకటిగా హిందాల్కో గుర్తింపు తెచ్చుకుంది. కుప్పం ప్లాంట్ పై డ రూ. 586 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ లో భాగం. ఈ ప్లాంట్ యాపిల్ గ్లోబల్ సప్లై చైన్ లో ఒక కీలకమైన భాగం కాబోతోందని పారిశ్రామిక కవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాంట్ నిర్మాణం ద్వారా సుమారు 613 ఉద్యోగాలు లభించనున్నాయి.
కీలకమైన విడిభాగాలను ఉత్పత్తి చేసే దిశగా ఒక ముందడుగుగా చెబుతున్నారు. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలను ఇప్పుడు భారతదేశంలోనే తయారు చేయడం అనేది దేశ పారిశ్రామిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి ఒక గొప్ప సంకేతమని సంతృప్తి వ్యక్తమవుతోంది. హిందాల్కో లాంటి ప్రపంచ స్థాయి సంస్థ పెట్టుబడి పెట్టడం వల్ల, ఈ ప్రాంతం మరిన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.