ప్రకృతికి విరుద్ధంగా చేసిన పనుల వల్ల వ్యతిరేక ఫలితాలే వస్తాయి. హైదరాబాదులో జరిగింది అదే. వందల చెరువులను కబ్జాచేసి భారీ భవంతులు, అపార్ట్ మెంట్లు నిర్మించిన ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. చెరువు, అలుగు, మత్తడి, శిఖం అనే వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కురుస్తున్న భారీ వర్షాలకు అనేక కాలనీలు నీట మునిగాయి. చెరువు ద్వారా నీరు బయటకు పోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థను కబ్జా చేసి చేసి భవనం నిర్మిస్తే ఏమవుతుంది? ఆ నీరు తన దారి తానే వెతుక్కుంటూ భవనాల్లోకే వస్తుంది.
నిజాం పేట, కూకట్ పల్లితోపాటు నగరంలోని చాలా ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ భవనాలు జలమయం అయ్యాయి. నిజాం పేటలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ప్రాంతంలో చెరువుల కబ్జాల ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నగరంలో ఎక్కడెక్కడ చెరువుల కబ్జా అయ్యాయనడానికి పాత లెక్కలు చూడాల్సిన అవసరం లేదు. ఆనాటి చెరువుల మ్యాపులు పరిశీలించాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ జనావాసాల్లోకి నీరు చేరిందో చూస్తే చాలు. కబ్జాలు బయటపడతాయి.
ఎక్కడో కొన్ని చోట్ల కబ్జాలు లేని ప్రాంతాల్లోనూ నీరు చేరిన దాఖలాలున్నాయి. చాలా వరకు కబ్జాల వల్లే వరద ఇళ్లను ముంచెత్తింది. నాలాలను కూడా వదలకుండా అక్రమ కట్టడాలు నిర్మించిన ఆనవాళ్లు ఇప్పుడు భారీ వర్షాలకు బయటపడుతున్నాయి. కబ్జా అయిన ప్రాంతాలు, లేదా వాటికి సమీపంలోని ప్రాంతాల ప్రజలే ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. ఎవరో బిల్డర్ కట్టిన అపార్ట్ మెంట్ భవనం చెరువులో ఉందా లేదా అనేది కూడా చాలా మందికి తెలియదు. అందుటాబు ధర అనగానే కొనుక్కున్న వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.
చెరువుల కబ్జాలు, నాలాలపై నిర్మాణాలను తొలగిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇది చాలా సున్నితమైన విషయం. కబ్జాకాండకు పాల్పడ్డ వారు ఫ్లాట్లను అమ్ముకుని వెళ్లిపోయారు. కొనుక్కున్న వాళ్లే ఇరుక్కున్నారు. కాబట్టి అలాంటి భవనాలు కూల్చకపోతే భవిష్యత్తులో మరింత ముప్పు. కూలిస్తే, అప్పో సపో చేసి కొనుక్కున్న వాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న. దీనికి పరిష్కారం ఏమిటనేది ప్రభుత్వాం ఆలోచించాలి. కనీసం ఇకముందైనా కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తే ఇక ముందైనా కొత్తగా ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది.


