హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సవాళ్లను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ 2050 పేరిట రూ. 4 లక్షల కోట్ల భారీ వ్యూహాన్ని ఖరారు చేసింది. భాగ్యనగరం ట్రాఫిక్ చిక్కుల్లో బెంగళూరును మించిపోతోందన్న విమర్శలు వస్తున్న సమయంలో నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు ఈ మెగా ప్లాన్ సిద్ధమైంది. మెట్రో రైలు నెట్‌వర్క్‌ను ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 2050 నాటికి 556 కిలోమీటర్లకు విస్తరించడం, ఎంఎంటీఎస్ నెట్‌వర్క్‌ను 336 కిలోమీటర్లకు పెంచడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశాలు.
ట్రాఫిక్ సమస్యలు రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతాయన్న నిపుణుల హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. కేవలం రహదారుల వెడల్పుతోనే సమస్య పరిష్కారం కాదని గుర్తించిన సర్కారు.. అండర్ పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు , ఎలివేటెడ్ కారిడార్ల మేళవింపుతో కూడిన మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థను తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బస్ లేన్లు, బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం సుమారు 48 కిలోమీటర్ల మేర కారిడార్లను ఈ ప్లాన్‌లో ప్రతిపాదించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిలకడగా ఉండాలంటే మెరుగైన కనెక్టివిటీ తప్పనిసరి. అందుకే మూడో దశ మెట్రో విస్తరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను అనుసంధానించాలని నిర్ణయించారు. దీనికి తోడు నగరం చుట్టూ ఉన్న ఏడు ప్రధాన ప్రాంతాల్లో ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్స్, ట్రక్ టెర్మినల్స్ నిర్మించడం ద్వారా నగరంలోకి భారీ వాహనాల రాకను నియంత్రించి, అంతర్గత రహదారులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
2050 విజన్‌తో రూపొందించిన ఈ ప్రణాళికలు సకాలంలో అమలుకు నోచుకుంటేనే హైదరాబాద్ తన పెట్టుబడుల ఆకర్షణను నిలబెట్టుకోగలదు. ఇప్పటికే బెంగళూరు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల లోపాలను పాఠాలుగా తీసుకుని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ట్రాన్సిట్ ఫస్ట్ విధానాన్ని వేగంగా అమలు చేయాల్సి ఉంది.
