ప్రేక్షకుడు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
ఈ ప్రశ్న సినిమా రూపకర్తల్ని అడిగితే చాలా సమాధానాలు వినిపిస్తాయి.
1. టికెట్ రేట్లు పెరిగిపోయాయి.
2. ఎండలు విపరీతంగా ఉన్నాయి.
3. స్నాక్స్ ధరలు భరించలేకపోతున్నారు.
4. ఐపీఎల్
5. ఓటీటీ.. ఇలా సవాలక్ష సమాధానాలు బయటకు వస్తాయి.
కానీ అసలు నిజం ఏమిటంటే… క్వాలిటీ సినిమాలు రావడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలు తీయడం లేదు. టికెట్ రేటు గిట్టుబాటు అయ్యే వినోదం ఇవ్వడం లేదు. ఇదే అసలు నిజం. కానీ.. ఇవేం దర్శక నిర్మాతలకు, హీరోలకు పట్టడం లేదు. ఇతరత్రా విషయాలపై పెట్టిన శ్రద్ద.. కంటెంట్ పై పెట్టడం లేదు.
హాస్య నటుడు రాహుల్ రామకృష్ణన్ ఈ కఠోర నిజాన్ని తన ట్వీట్ రూపంలో తెలియజేశారు. ప్రేక్షకుల టికెట్ రేటుకి విలువ ఇవ్వడం లేదని, గిట్టుబాటు అయ్యే సినిమాలు తీయడం లేదని, అందుకే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని రాహుల్ ట్వీట్ చేశారు. మన సినిమాలు ఎంత దారుణంగా ఉన్నాయో, ఖాళీగాట ఉన్న సినిమా థియేటర్లే చెబుతున్నాయంటున్నాడు. పెట్రోలు ధరలు, ట్రాఫిక్, స్నాక్ రేట్లు, టాక్స్ లు.. వీటన్నింటినీ దాటుకొని ఓ ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే, సెల్ ఫోన్ నుంచి దృష్టి మరలాలంటే సినిమా అద్భుతంగా ఉండాల్సిందేనని గుర్తు చేశాడు.
మేకర్స్ ఈ విషయాలపై దృష్టి పెడితే తప్పకుండా బాగుంటుంది. ఈ వేసవి సీజన్ వృధా అవ్వడానికీ, సంక్రాంతి తరవాత సరైన హిట్ లేకపోవడం వెనుక కారణాలు.. ఐపీఎల్, ఎండలు కానే కావు. కంటెంట్ విషయంలో తేలిపోవడం. సరైన కంటెంట్ ఇవ్వగలిగితే, ఇప్పటికీ థియేటర్లు కిటకిటలాడతాయి. దాని ముందు ఐపీఎల్ కూడా బలాదూరే. అది మానేసి, మిగిలిన ఇషయాలపై ఫోకస్ పెడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మాయ నుంచి వాళ్లెప్పుడు బయటకు వస్తారో..?
